అవును.. నేను జబర్దస్త్ చేయడం లేదు

వారం రోజులుగా నలుగుతున్న కథనాలకు, ఊహాగానాలకు నాగబాబు చెక్ పెట్టారు. తను జబర్దస్త్ కార్యక్రమం నుంచి తప్పుకున్నట్టు అధికారికంగా ప్రకటించారు. రేపు కార్యక్రమం తర్వాత తానింక జబర్దస్త్ లో కనిపించనని స్పష్టంచేశారు నాగబాబు. వ్యాపారానికి…

వారం రోజులుగా నలుగుతున్న కథనాలకు, ఊహాగానాలకు నాగబాబు చెక్ పెట్టారు. తను జబర్దస్త్ కార్యక్రమం నుంచి తప్పుకున్నట్టు అధికారికంగా ప్రకటించారు. రేపు కార్యక్రమం తర్వాత తానింక జబర్దస్త్ లో కనిపించనని స్పష్టంచేశారు నాగబాబు. వ్యాపారానికి సంబంధించిన అభిప్రాయబేధాల వల్లనే బయటకు వచ్చేశానంటున్నారు.

“నేను జబర్దస్త్ మానేయడానికి ఏవేవో ఊహాగానాలు బయటకు వస్తున్నాయి. లేనిపోని ఊహాగానాలు క్రియేట్ చేయడం ఇష్టంలేక మాట్లాడుతున్నాను. ఈ ఇష్యూను వివాదాస్పదం చేయాలని నేను మీ ముందుకు రావడం లేదు. శుక్రవారం వచ్చే ఎపిసోడ్ తర్వాత నేను కనిపించను. నాకు నేనుగా మానేసే పరిస్థితి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఆ పరిస్థితి వచ్చింది. వ్యాపారానికి సంబంధించిన సైద్ధాంతిక విభేదాల వల్లనే నేను బయటకు వచ్చాను.”

పారితోషికం పెంచకపోవడం వల్లనే షో నుంచి బయటకు వచ్చేశాననే ఊహాగానాల్ని నాగబాబు ఖండించారు. తనకు పారితోషికం పెద్ద సమస్య కాదన్నారు. అదే సమయంలో.. తన స్థాయికి తగ్గ పారితోషికాన్ని మల్లెమాల సంస్థకు చెందిన శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఇవ్వలేదని కూడా ఆరోపించారు.

“పారితోషికం విషయంలో వచ్చిన గొడవల వల్లే నేను జబర్దస్త్ నుంచి బయటకు వెళ్లిపోయానని ఎవరో నన్ను అడిగారు. ఇప్పుడు చెబుతున్నాను, రెమ్యూనరేషన్ నాకస్సలు ప్రామాణికం కాదు. ఉన్నంతలో నాకు మంచి పారితోషికం ఇచ్చారు. కానీ అది నా స్థాయికి తగ్గ రెమ్యూనరేషన్ కాదని నాకు తెలుసు. కానీ నాకది ఇష్యూనే కాదు. నేను ఇన్నాళ్లూ జబర్దస్త్ చేయడానికి, ఇప్పుడు ఆ కార్యక్రమం నుంచి బయటకు రావడానికి రెమ్యూనరేషన్ కారణం కాదు.”

2013 ఫిబ్రవరి నుంచి జబర్దస్త్ కు జడ్జిగా వ్యవహరించారు నాగబాబు. ఈ ప్రయాణాన్ని హ్యాపీ అండ్ ఎమోషనల్ జర్నీగా చెప్పుకొచ్చారు. తన భవిష్యత్ కార్యక్రమాన్ని త్వరలోనే వెల్లడిస్తానని ప్రకటించారు.