నాగచైతన్య, సమంత విడాకుల వ్యవహారం కొన్నాళ్ల పాటు హాట్ టాపిక్ గా నడిచింది. టాలీవుడ్ హాట్ కపుల్ గా ఉన్న ఆ జంట సడెన్ గా ఎందుకు విడాకులు తీసుకున్నారనేది ఇప్పటికీ బయట వ్యక్తులకు సమాధానం దొరకని ప్రశ్నగానే మిగిలిపోయింది. విడాకుల తర్వాత 2-3 సార్లు సమంత రియాక్ట్ అయింది. తన ప్రైవసీని గౌరవించాలని కోరింది.
ఎట్టకేలకు ఈ అంశంపై నాగచైతన్య రియాక్ట్ అయ్యాడు. బంగార్రాజు ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన నాగచైతన్య.. తమ మంచి కోసం తాము తీసుకున్న బెస్ట్ డెసిషన్ గా ఈ విడాకుల్ని చెప్పుకొచ్చాడు.
“మా ఇద్దరి మంచి కోసం తీసుకున్న నిర్ణయం అది. తను సంతోషంగా ఉంది. నేను కూడా సంతోషంగా ఉన్నాను. మేమున్న పరిస్థితుల్లో ఇదే బెస్ట్ డెసిషన్. కలిసి నిర్ణయం తీసుకున్నాం.”
విడాకులకు కారణం ఏంటనేది నాగచైతన్య కూడా చెప్పలేదు. అది పూర్తిగా వాళ్ల వ్యక్తిగతం కాబట్టి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అయితే చైతూ స్టేట్ మెంట్ తో ఒక్క మేటర్ మాత్రం క్లియర్ అయింది. ఈ విడాకులతో అటు సమంత, ఇటు నాగచైతన్య ఇద్దరూ సంతోషంగానే ఉన్నారన్నమాట.
విడాకుల వ్యవహారం తర్వాత పెద్దగా గ్యాప్ తీసుకోలేదు సమంత. విడిపోయిన విషయం ప్రకటించిన వెంటనే ఓ ఫొటో షూట్ లో పాల్గొంది. ఆ తర్వాత టూర్ వెళ్లొచ్చింది. ఆ వెంటనే సినిమాలతో బిజీ అయిపోయింది. ఐటెంసాంగ్స్ కూడా ఓకే అనేస్తోంది.
ఇటు నాగచైతన్య కూడా ప్రొఫెషనల్ గా బిజీ అయిపోయాడు. బంగార్రాజును రిలీజ్ కు రెడీ చేశాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేసిన థాంక్యూ సినిమా కూడా రెడీ అయిపోతోంది.