మాల్దీవులకు వ్యతిరేకంగా భారత్ లో జరుగుతున్న నిరసన కార్యక్రమాల గురించి అందరికీ తెలిసిందే. వేల సంఖ్యలో ట్రిప్స్ కాన్సిల్ అవుతున్నాయి. ఇప్పుడీ లిస్ట్ లోకి నాగార్జున కూడా చేరారు.
గ్యాప్ లేకుండా షూటింగ్ చేసిన నాగార్జున, నా సామిరంగ సినిమా రిలీజ్ తర్వాత, మాల్దీవులు వెళ్లి కాస్త రిలాక్స్ అవుదాం అనుకున్నారు. తాజాగా జరిగిన పరిణామాలతో ఆయన తన టూర్ రద్దు చేసుకున్నారు.
“బిగ్ బాస్ తో కలిపి 75 రోజులు నాన్ స్టాప్ గా పనిచేశాను. సినిమా రిలీజ్ తర్వాత రిలాక్స్ అవ్వాలనుకున్నాను. 17న వెళ్దామని బుక్ చేశాను, కానీ ఈమధ్య టిక్కెట్లన్నీ కాన్సిల్ చేశాను. ఇంతకుముందు చాలాసార్లు వెళ్లాను. ఈసారి మాత్రం రద్దు చేశాను. ఇదేదో ఎవరో ఏదో అనుకుంటారని లేదా భయపడి చేసింది కాదు. మాల్దీవులు మంత్రులు మాట్లాడిన మాటలు మంచివి కావు. అవి సత్సంబంధాల్ని దెబ్బతీస్తాయి. మన దేశ ప్రధానిని ఉద్దేశించి వాళ్లు మాట్లాడిన మాటలు కరెక్ట్ కాదు.”
ఇలా మాల్దీవులకు వ్యతిరేకంగా జరుగుతున్న కార్యక్రమంలోకి నాగార్జున కూడా చేరారు. ఇప్పటికీ తనకు చాలా అలసటగా ఉందని, నా సామిరంగ సక్సెస్ అయితే తన అలసట మొత్తాన్ని మర్చిపోతానని అంటున్నారు నాగార్జున.
ఈ సందర్భంగా మరో ఇంట్రెస్టింగ్ విషయాన్ని కూడా బయటపెట్టారు. నా సామిరంగ సినిమాలో ఓ పాట పాడాలనుకున్నారట నాగార్జున. కాస్త ప్రయత్నించారు కూడా. అయితే బాగా ప్రాక్టీస్ చేసి పాడాల్సిన పాట అది. టైమ్ లేకపోవడంతో ఆ సాంగ్ పాడలేకపోయానని చెప్పుకొచ్చారు.