పుట్టినరోజు సందర్భంగా నాగార్జున నుంచి కొత్త సినిమా టైటిల్ ఒకటి ఇప్పటికే విడుదలైంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాకు ఘోస్ట్ అనే టైటిల్ పెట్టారు. ఇప్పుడు అదే నాగార్జున డెవిల్ గా కూడా మారాడు. అవును.. బంగార్రాజు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. టైటిల్ డిజైన్ కూడా విడుదల చేశారు. దీనికి ది డెవిల్ ఈజ్ బ్యాక్ అనే క్యాప్షన్ పెట్టారు.
అప్పుడెప్పుడో 2016లో రిలీజైంది సోగ్గాడే చిన్ని నాయనా సినిమా. అందులో ఓ షేడ్ లో బంగార్రాజుగా కనిపించాడు నాగ్. ఆ పాత్రను ఆధారంగా చేసుకొని, అదే టైటిల్ తో ఇప్పుడు సీక్వెల్ వస్తోంది. అప్పుడు బంగార్రాజు గెటప్ లో నాగ్ ఎలా ఉన్నాడో, ఇన్నేళ్ల తర్వాత కూడా ఆ గెటప్ లో అచ్చుగుద్దినట్టు అలానే ఉన్నాడు ఈ హీరో.
స్వర్గం మెట్ల నుంచి బంగార్రాజుగా కిందకి దిగొస్తున్న నాగార్జున పోజు ఆకట్టుకునేలా ఉంది కానీ.. సరదాగా సాగిపోయే ఆ పాత్రకు ది డెవిల్ ఈజ్ బ్యాక్ అనే క్యాప్షన్ ఎందుకు పెట్టారో అర్థం కాలేదు.
కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తాజాగా సెట్స్ పైకొచ్చింది ఈ సినిమా. అన్నపూర్ణ స్టుడియోస్, జీ స్టుడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. మూవీలో నాగార్జునతో పాటు నాగచైతన్య కూడా నటిస్తున్నాడు. నాగ్ సరసన రమ్యకృష్ణ, చైతూ సరసన కృతి శెట్టి హీరోయిన్లుగా కనిపించబోతున్నారు.