జగన్ ప్రభుత్వంతో హీరో నాని ఢీకొట్టాడు. ఇప్పుడు తాను ఏం మాట్లాడినా వివాదం అవుతుందంటూనే…ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం. వివిధ కారణాల రీత్యా ఏపీ ప్రభుత్వంతో సినీ పరిశ్రమకు సత్సంబంధాలు లేవు.
అగ్గికి ఆజ్యం తోడైన చందంగా… కొందరు సినీ ప్రముఖులు ఏపీ ప్రభుత్వాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో వ్యవహారం రోజురోజుకూ ముదురుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంపై నేచురల్ స్టార్ నాని ఘాటు వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. నాని హీరోగా నటించిన ‘శ్యామ్‌సింగరాయ్’ మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీన్ని పురస్కరించుకుని హీరో నాని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన సంచలన, వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నాని ఏమన్నారో ఆయన మాటల్లోనే…
‘ఏపీ ప్రభుత్వం టికెట్ ధరలు తగ్గించింది. ఏది ఏమైనా ఆ నిర్ణయం సరైంది కాదు. టికెట్ ధరలు తగ్గించి ప్రేక్షకులను అవమానించింది. థియేటర్ల కంటే పక్కన ఉన్న కిరాణా షాపుల కలెక్షన్ ఎక్కువగా ఉంది. టికెట్ ధరలు పెంచినా కొనే సామర్థ్యం ప్రేక్షకులకు ఉంది. అయితే నేను ఇప్పుడు ఏదీ మాట్లాడినా వివాదమే అవుతుంది. టూర్‌కు తీసుకెళ్లే పిల్లల నుంచి ఉపాధ్యాయులు ఒక్కొక్కరి నుంచి 100 వసూలు చేస్తే ఒకరిని నువ్వు ఇవ్వలేవంటే అవమానించడమే. నా పేరు ముందు 'నేచురల్ స్టార్' తీసేద్దామనుకుంటున్నా. ప్రేక్షకులకు సినిమా చూపించడమే మా లక్ష్యం. లెక్కలు తర్వాత చూసుకుందాం ’ అని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
నాని వ్యాఖ్యలు వ్యక్తిగతమా లేక ఇండస్ట్రీ అభిప్రాయమా? అనేది తేలాల్సి వుంది. మరికొన్ని గంటల్లో తన సినిమా విడుదలవుతున్న తరుణంలో నాని ఎందుకు ఈ విధంగా మాట్లాడారనేది చర్చనీయాంశమైంది. నాని విమర్శలే పరిశ్రమ అభిప్రాయాలైతే మాత్రం… ప్రభుత్వంతో ఘర్షణకు దిగుతున్నట్టుగా అర్థం చేసుకోవాలనే టాక్ వినిపిస్తోంది.