టక్ జగదీశ్ సినిమా ఓటీటీలో రిలీజైన రోజులవి.. ఆ టైమ్ లో క్రిటిక్స్ నుంచి కామన్ గా వినిపించిన విమర్శ ఒకటుంది. అదేంటంటే.. ఈ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజైంది కాబట్టి సరిపోయింది, థియేటర్లలో రిలీజై ఉంటే ఫలితం మరింత దారుణంగా ఉండేదనేది ఆ కామెంట్.
అందులో నిజం ఎంతనేది ఎవ్వరూ తేల్చలేరు. ఎందుకంటే టక్ జగదీశ్ థియేటర్లలో రిలీజ్ అవ్వదు కాబట్టి. అయితే ఇప్పుడా సినిమా యూనిట్ కు ఉన్నంతలో ఊరట కలిగించే అంశం ఒకటి ఇప్పుడు బయటకొచ్చింది.
టీవీల్లో టక్ జగదీశ్ సినిమా సూపర్ హిట్టయింది. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా స్టార్ మా ఛానెల్ లో ఈ సినిమాను ప్రసారం చేస్తే ఏకంగా 10.89 రేటింగ్ వచ్చింది. అంటే.. సినిమాను టీవీ ప్రేక్షకులు ఆదరించినట్టే లెక్క. రిలీజ్ టైమ్ లో సినిమాపై వచ్చిన విమర్శలకు ఈ రేటింగ్ తో సగం చెక్ పెట్టినట్టయింది.
నాని, శివ నిర్వాణ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాపై స్ట్రీమింగ్ కు ముందు భారీ అంచనాలుండేవి. కానీ విడుదలైన తర్వాత ఈ మూవీ ఆ అంచనాల్ని అందుకోలేకపోయింది. సినిమాలో ఎమోషన్స్ కంటే, నాని ఎలివేషన్స్ పై దర్శకుడు ఎక్కువగా దృష్టి పెట్టాడని, నానిని మాస్ హీరోగా ప్రజెంట్ చేసే ప్రయత్నం ఎక్కువైందంటూ కామెంట్స్ పడ్డాయి.
ఇలా నెగెటివ్ రిమార్క్స్ వచ్చినప్పటికీ టక్ జగదీశ్ సినిమా బుల్లితెరపై మాత్రం హిట్టయింది. ఇక రాజ రాజ చోర సినిమాకు దీనికి రివర్స్ లో జరిగింది. శ్రీవిష్ణు నటించిన ఈ సినిమా థియేటర్లలో హిట్టయింది, కానీ టీవీలో మాత్రం ఫెయిల్ అయింది. ఈ మూవీకి జస్ట్ 3 రేటింగ్ వచ్చింది.