అదిగో.. ఇదిగో.. అంటూ హిందీ మీడియా, ఉత్తరాది మీడియా చేసిన హడావుడికే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నే హడలిపోయిందేమో కానీ, ఎట్టకేలకూ బాలీవుడ్ టాప్ హీరోయిన్లకు సమన్లు జారీ చేసింది. డ్రగ్స్ వ్యవహారం విషయంలో విచారణకు రావాలని వారికి డేట్లను ఇచ్చిందట ఎన్సీబీ. దీపికా పదుకోన్, సారా అలీఖాన్, శ్రద్ధ కపూర్, రకుల్ ప్రీత్ సింగ్ లకు ఎన్సీబీ నుంచి నోటీసులు జారీ అయినట్టుగా తెలుస్తోంది. విచారణకు పిలుస్తూ ఎన్సీబీ వారికి నోటీసులను పంపించినట్టుగా సమాచారం.
సెప్టెంబర్ 25న దీపిక, సెప్టెంబర్ 26న శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్ లు విచారణకు హాజరు కావాలని ఎన్సీబీ పేర్కొన్నట్టుగా ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది.
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంపై జరుగుతున్న విచారణ డ్రగ్స్ వ్యవహారంపై చర్చగా మారిన సంగతి తెలిసిందే. సుశాంత్ డ్రగ్స్ వాడాడని నిర్ధారించుకున్న ఎన్సీబీ ఈ విషయంలో రియా చక్రబర్తిని ప్రశ్నించగా, ఆమె పలు అంశాలను ప్రస్తావించిందని, అందులో భాగంగానే దీపిక, సారా, శ్రద్ధ, రకుల్ పేర్లను ఆమె చెప్పిందని.. దీంతో వారిని వారిని ఎన్సీబీ విచారణకు పిలుస్తోంది అనేది సూఛాయగా వినిపిస్తున్న కథనం. మరి ఈ నటీమణులు ఏం చెబుతారు? వీళ్లు మరెవరి పేర్లనైనా చెబుతారా? ఈ డ్రగ్స్ కేసు ఎంత వరకూ వెళ్తుందో!