కొందరు హీరోయిన్లకు దురదృష్టం ఎప్పుడూ వాళ్లు హ్యాండ్ బ్యాగులో సిద్ధంగా ఉంటుంది. చేతివరకు వచ్చిన అవకాశం కళ్లముందు చేజారిపోతుంది. ఈ విషయంలో హీరోయిన్ నివేత పెతురాజ్ అందరికంటే ముందుంటుంది. అవకాశాలు చేజారిపోవడం ఆమెకు కొత్త కాదు. అయితే ఈసారి మాత్రం ఓ పెద్ద ఛాన్స్ మిస్ అయింది.
బాబి దర్శకత్వంలో ఓ భారీ సినిమా చేస్తున్నారు చిరంజీవి. ఇందులో ఓ కీలక పాత్ర కోసం రవితేజను తీసుకున్నారు. చిరంజీవి సరసన శృతిహాసన్ ను, రవితేజ సరసన నివేత పెతురాజ్ ను హీరోయిన్లుగా ఎంపిక చేశారు. అయితే అంతలోనే మార్పు జరిగిపోయింది. అధికారికంగా ప్రకటించకముందే నివేత పెతురాజ్ మారిపోయింది. ఆ స్థానంలో క్యాథరీన్ త్రెసా వచ్చి చేరింది.
నివేతకు ఇలా జరగడం ఇదే తొలిసారి కాదు. గతంలో రిపబ్లిక్ మూవీ టైమ్ లో కూడా ఇలానే జరిగింది. సాయితేజ్ హీరోగా నటించిన ఆ సినిమా ఓపెనింగ్ కు కూడా నివేత హాజరైంది. కట్ చేస్తే, సినిమా సెట్స్ పైకి వెళ్లిన కొన్ని రోజులకే నివేతను తప్పించారు. నిర్మాతలతో అండర్ స్టాండింగ్ సరిగ్గా కుదరక నివేత తప్పుకుందట. ఆ స్థానంలోకి ఐశ్వర్య రాజేష్ వచ్చింది.
ఈ రెండు సినిమాలతో పాటు గతంలో రవితేజ, నాగచైతన్య సినిమాల్లో కూడా ఆఫర్లు మిస్ చేసుకుంది నివేత. ఇవన్నీ పక్కనపెడితే.. చిరంజీవి సినిమాలో ఆఫర్ మిస్సవ్వడం మాత్రం ఆమె కెరీర్ కు పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. తనకు ఎందుకిలా అవకాశాలు మిస్ అవుతున్నాయో నివేత ఓసారి చెక్ చేసుకుంటే మంచిదేమో.