చాన్నాళ్ల తరువాత మళ్లీ నైజాంలో థియేటర్ల రగడ తెరవెనుక షురూ అయింది. కొత్తగా మైత్రీ మూవీస్..డిస్ట్రిబ్యూషన్ ఆఫీసు ప్రారంభించడంతో నైజాంలో థియేటర్లను బ్లాక్ చేసే పని మొదలైంది. ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ థియేటర్ల యజమానులను, మైత్రీ సినిమాలకు థియేటర్లు ఇస్తే, మళ్లీ తన ఆఫీసు గడప తొక్క వద్దని హెచ్చరిస్తున్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
గతంలో డబ్బింగ్ సినిమాకు థియేటర్లు ఎలా ఇస్తారు సంక్రాంతి సీజన్ లో అని ఓపెన్ గా నిలదీసిన దిల్ రాజునే ఈ సంక్రాంతికి తన డబ్బింగ్ సినిమాను అత్యంత భారీగా విడుదల చేస్తున్నారు. దాంతో పాటు అజిత్ డబ్బింగ్ సినిమాను కూడా దిల్ రాజే విడుదల చేయబోతున్నారు.
మరోపక్క బాలకృష్ణ వీరసింహా రెడ్డి, మెగాస్టార్ వాల్తేర్ వీరయ్య కూడా విడుదలవుతున్నాయి. ఈ రెండు సినిమాలను మైత్రీ సంస్థ నైజాంలో స్వంతంగా విడుదల చేసుకుంటోంది. ఇందుకోసం డిస్ట్రిబ్యూషన్ ఆఫీసు ఓపెన్ చేసారు. ఇది నైజాంలో థియేటర్ల గడబిడకు దారితీస్తోంది. ఆసియన్ సంస్థ చేతిలో చాలా థియేటర్లు వున్నాయి. ఏజెంట్ సినిమా రాకపోతే మైత్రీకి థియేటర్లు ఇవ్వడం తనకు అభ్యంతరం లేదని ఆసియన్ సునీల్ క్లారిటీ ఇచ్చేసారు.
ఇదిలా వుంటే విశాఖలో కూడా ఎక్కువ థియేటర్లు, మంచి థియేటర్లు వారసుడు సినిమాకు వెళ్లిపోయాయని ఇటు బాలయ్య, అటు మెగా ఫ్యాన్స్ బాధపడుతున్నారు. మెగాస్టార్ సినిమా కన్నా కూడా బాలయ్య సినిమాకు తక్కువ థియేటర్లు దొరుకుతున్నట్లు తెలుస్తోంది.
మొత్తం మీద ఏస్ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు రెండు డబ్బింగ్ సినిమాలు విడుదల చేయడం, రెండు స్ట్రయిట్ సినిమాలకు ఇబ్బందిగా మారింది. కానీ టాలీవుడ్ లో అదేమిటి? అని ప్రశ్నించేంత సీన్ అయితే లేదు.