మరోసారి చిన్న సినిమాల ప్రవాహం

ఓ పెద్ద సినిమా విడుదలకు ముందు చిన్న సినిమాలు క్యూ కట్టడం సహజం. ఓ పెద్ద సీజన్ కు ముందు కూడా ఈ పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మరోసారి టాలీవుడ్ లో ఆ పరిస్థితి…

ఓ పెద్ద సినిమా విడుదలకు ముందు చిన్న సినిమాలు క్యూ కట్టడం సహజం. ఓ పెద్ద సీజన్ కు ముందు కూడా ఈ పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మరోసారి టాలీవుడ్ లో ఆ పరిస్థితి వచ్చింది. సమ్మర్ బాక్సాఫీస్ సీజన్ కోసం పెద్ద సినిమాలన్నీ వెయిట్ చేస్తున్న వేళ, టాలీవుడ్ బాక్సాఫీస్ ఒక్కసారిగా ఖాళీ అయింది. ఈ గ్యాప్ ను క్యాష్ చేసుకునేందుకు చిన్న సినిమాలు క్యూ కడుతున్నాయి.

ఈ వారాంతం ఏకంగా 7 సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. ఇవన్నీ చిన్న సినిమాలే. వీటిలో చెప్పుకోదగ్గ సినిమా మాత్రం ఒక్కటే. అదే సీఎస్ఐ సనాతన్.

ఆది సాయికుమార్ హీరోగా నటించిన ఈ సినిమాపై ఎవ్వరికీ ఎలాంటి అంచనాల్లేవ్. ఆది సినిమాలు ఎప్పుడొస్తున్నాయో, ఎప్పుడు వెళ్తున్నాయో కూడా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అందుకే, సీఎస్ఐ సనాతన్ పై కూడా ఎలాంటి బజ్ లేదు. అయితే పోటీలేని వాతావరణంలో వస్తున్న కారణంగా, కంటెంట్ ఏమాత్రం బాగున్నా సినిమా క్లిక్ అవుతుందని ఆశపడుతున్నాడు ఆది సాయికుమార్.

ఈ సినిమా తప్పితే, మిగతా సినిమాల్లో ఆర్టిస్టులు కూడా చెప్పుకునే స్థాయిలో లేరు. పులి (డబ్బింగ్ సినిమా), వాడు ఎవడు, మిస్టర్ కల్యాణ్, నేడే విడుదల, టాక్సీ, దోచేవారెవరురా.. ఇలా చిన్న సినిమాలన్నీ ఈ వారం వరుసపెట్టి థియేటర్లలోకి రాబోతున్నాయి.

అయితే ఈ వీకెండ్ బాక్సాఫీస్ వద్ద ఓ ప్రత్యేకత ఉంది. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా రీ-రిలీజ్ అవుతోంది. పీవీఆర్ ఛెయిన్ తో పాటు, చాలా మల్టీప్లెక్సుల్లో ఈ సినిమా మరోసారి సందడి చేయనుంది. ఆస్కార్ బరిలో నిలిచిన నేపథ్యంలో, ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకునే ఉద్దేశంతో ఇలా మరోసారి ఆర్ఆర్ఆర్ ను రిలీజ్ చేస్తున్నారు. గతేడాది సరిగ్గా ఇదే నెలలో ఆర్ఆర్ఆర్ రిలీజైంది.