పండగొచ్చిందంటే టాలీవుడ్ లో హంగామా మామూలుగా ఉండదు. చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు అంతా ఏదో ఒక అప్ డేట్ తో సందడి చేస్తుంటారు. నిన్న కూడా అలాంటి సందడి కోసమే ఎదురుచూశారు చాలామంది హీరోల ఫ్యాన్స్. కానీ వాళ్లకు ఆశాభంగం ఎదురైంది.
పవన్ కల్యాణ్ ఓజీ, హరిహర వీరమల్లు సినిమాలు చేస్తున్నాడు. సెట్స్ పై ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా ఉంది. రీసెంట్ గా ఈ సినిమా నుంచి షూట్ స్టార్ట్ అయిన సందర్భంగా ఓ స్టిల్ కూడా రిలీజ్ చేశారు. దీంతో చవితికి మరో స్టిల్ వస్తుందని ఊహించిన ఫ్యాన్స్ కు నిరాశ తప్పలేదు.
అటు గుంటూరు కారం నుంచి కూడా ఎలాంటి అప్ డేట్ రాలేదు. మహేష్-త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ఈ సినిమా నుంచి ఓ సాంగ్ రెడీ అయిందంటూ వార్తలొచ్చాయి. ఆ పాట వినాయక చవితికి రిలీజ్ అవుతుందనే పుకార్లు కూడా వచ్చాయి. పాట రాకపోయినా, కనీసం సాంగ్ అప్ డేట్ అయినా చవితికి ఇచ్చి ఉంటే బాగుండేది.
ప్రభాస్ సినిమాలు కూడా చాలానే సెట్స్ పై ఉన్నాయి. వీటిలో మారుతి సినిమా, కల్కి నుంచి ఫ్యాన్స్ ఎలాంటి అప్ డేట్స్ ఆశించలేదు. సలార్ నుంచి మాత్రం అప్ డేట్ ఆశించారు. ఎందుకంటే, ఈ సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. కాబట్టి కొత్త విడుదల తేదీని వినాయక చవితి సందర్భంగా ప్రకటిస్తారని ఎదురుచూశారు. కానీ ఆ ప్రయత్నం జరగలేదు.
ఇలా చెప్పుకుంటూ పోతే రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, అల్లు అర్జున్ పుష్ప-2, ఎన్టీఆర్ దేవర.. ఇలా పెద్ద సినిమాలేవీ వినాయక చవితికి అప్ డేట్స్ ఇవ్వలేదు.