నవంబర్ బాక్సాఫీస్ కు దరిద్రం పట్టింది. ఒక్కటంటే ఒక్క సినిమా కూడా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోలేదు. 30 సినిమాలు రిలీజ్ అయితే ఒక్కటి కూడా మెరవలేకపోయింది.
నిజానికి ప్రతి సంవత్సరం నవంబర్ బాక్సాఫీస్ కాస్త డల్ గానే ఉంటుంది. అయితే కొన్ని మెరుపులుంటాయి. ఉదాహరణకు గతేడాది బాక్సాఫీస్ నే తీసుకుంటే.. లవ్ టుడే, మసూద లాంటి సినిమాలు ఆకట్టుకున్నాయి. కానీ ఈ ఏడాది నవంబర్ లో అలాంటి మెరుపుల్లేవ్.
నవంబర్ మొదటి వారంలో ఏకంగా 12 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఘోస్ట్, కీడాకోలా, మా ఊరి పొలిమేర-2, కృష్ణఘట్టం లాంటి సినిమాలొచ్చాయి. వీటిలో కూసింత ఆకట్టుకున్న సినిమా పొలిమేర-2 మాత్రమే. ఈ సినిమా ఓ సెక్షన్ ఆడియన్స్ కు నచ్చింది. దీన్ని తప్పిస్తే, మరే సినిమా నిలబడలేదు. తరుణ్ భాస్కర్ తీసిన కీడాకోలాపై కొంతమందికి అంచనాలుండేవి. ఆ అంచనాల్ని సినిమా అందుకోలేకపోయింది. మిగతా సినిమాల గురించి చర్చ అనవసరం.
రెండో వారంలో.. డబ్బింగ్ సినిమాల సందడి కొనసాగింది. జపాన్, జిగర్తాండా డబుల్ ఎక్స్, టైగర్ 3 సినిమాలొచ్చాయి. ఆశ్చర్యకరంగా 3 సినిమాలకూ మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ తెలుగులో నిలబడిన సినిమా ఒక్కటి కూడా లేదు. కార్తి కెరీర్ లో 25వ చిత్రంగా వచ్చిన జపాన్ తెలుగులో ఫ్లాప్ అయింది. జిగర్తాండా డబుల్ ఎక్స్ తమిళ్ లో, టైగర్ 3 ఉత్తరాదిన ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలతో పాటు వచ్చిన మిగతా సినిమాలన్నీ ఫ్లాప్.
నవంబర్ మూడో వారంలో.. భారీ అంచనాలతో వచ్చిన సినిమా మంగళవారం. టీజర్, ట్రయిలర్ తో ఈ సినిమాపై ఓ రేంజ్ లో ఊపు వచ్చింది. సినిమాలో ట్విస్టులు కూడా అదే రేంజ్ లో ఉండడంతో చాలామంది సూపర్ అన్నారు. కానీ ప్రచారానికి, పబ్లిక్ టాక్ కు మధ్య చాలా తేడా ఉంటుంది. ఆ తేడా మంగళవారం విషయంలో స్పష్టంగా కనిపించింది.
అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్ పుల్ లీడ్ రోల్ లో నటించిన మంగళవారం సినిమా బాగుంది అనిపించుకుంది తప్ప, బ్లాక్ బస్టర్ రేంజ్ కు వెళ్లలేదు. మరోవైపు ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వలేదనే టాక్ కూడా అక్కడక్కడ వినిపించింది.
ఈ సినిమాతో పాటు. స్పార్క్ లైఫ్, మై నేమ్ ఈజ్ శృతి, సప్తసాగరాలు దాటి సైడ్-బి లాంటి సినిమాలొచ్చాయి. ఇవన్నీ వేటికవే ఫ్లాపులుగా నిలిచాయి. తెలుగులో మరోసారి మెరవాలనుకున్న హన్సిక ఆశలు 'మై నేమ్ ఈజ్ శృతి' సినిమాతో గల్లంతు కాగా.. సైడ్-ఏ లానే సప్తసాగరాలు దాటి సైడ్-బి కూడా ఇలా వచ్చి అలా వెళ్లింది.
నాలుగో వారంలో ప్రచారంతో సౌండ్ చేసిన సినిమా ఆదికేశవ. సితార బ్యానర్, మెగా హీరో వైష్ణవ్ తేజ్, స్టార్ హీరోయిన్ శ్రీలీల ఉండడంతో అందరి చూపు పడింది. అయితే మొదటి రోజు మొదటి ఆటకే ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. దీని కంటే సౌండ్ పార్టీ అనే చిన్న సినిమా నయం. కనీసం బి, సి సెంటర్ సింగిల్ స్క్రీన్స్ లో అక్కడక్కడ ఆడింది.
ఈ సినిమాలతో పాటు కోటబొమ్మాళి పీఎస్ అనే సినిమా కూడా వచ్చింది. గీతాఆర్ట్స్ సపోర్ట్ తో గ్రాండ్ గా రిలీజైన ఈ సినిమా కూడా ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. ఈ రీమేక్ సినిమాకు ఓ కల్ట్ స్టేటస్ వస్తుందని మేకర్స్ ఆశించారు. ఆ ఫలితాన్ని ఇది అందించలేకపోయింది.
ఇలా ఓవరాల్ గా నవంబర్ లో డబ్బింగ్ మూవీస్ తో కలిపి 30 సినిమాలు రిలీజ్ అవ్వగా.. వీటిలో మంగళవారం, మా ఊరి పొలిమేర-2 సినిమాలు మాత్రమే కొంచెం హడావుడి చేశాయి. వీటిని మించిన హిట్ ఇంకోటి లేదు కాబట్టి, నవంబర్ లో ఈ రెండు సినిమాలే కొంత బెటర్ అని చెప్పుకోవాలి.