పైకి ఎవ్వరూ మాట్లాడడం లేదు కానీ టాలీవుడ్ లో లోపల మాత్రం ఎన్టీఆర్ మీద గుస్సాయిస్తోంది. ప్రశాంతంగా వున్న వాతావరణాన్ని చెడగొట్టారంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఇక్కడ రెండు పాయింట్లు వున్నాయి. ఒకటి ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా టాలీవుడ్ ఫ్రెండ్లీ గా వుంది. రేట్లు అడిగితే రేట్లు, పర్మిషన్లు అడిగితే పర్మిషన్లు, ఏం అడిగితే అవి ఇస్తూ వస్తోంది. ఆంధ్రోళ్లు అనే మాటనే మరిచిపోయి, అందరినీ కలుపుకుపోతున్నారు కేసిఆర్. అమిత్ షా ను ఎన్టీఆర్ కలవడం వల్ల ఈ ప్రశాంత వాతావరణం చెడిపోతుందనే ఆందోళన ఒక పాయింట్. రెండవది కూడా వుంది.
ఇండస్ట్రీలో కనీసం అరవై డెభై శాతం మంది ప్రో తెలుగుదేశం జనాలు. భాజపా కావాలని ప్లాన్ ప్రకారం చంద్రబాబును, లోకేష్ ను దూరం పెడుతూ ఎన్టీఆర్ ను దగ్గరకు తీసారన్నది ఓ అనుమానం. తెలుగుదేశం, భాజపా ఈ రాజకీయాలు అన్నీ తెలియని వాడేం కాదు ఎన్టీఆర్. మరి అన్నీ తెలిసి ఎందుకు అమిత్ షా ను కలవడానికి వెళ్లాడు అన్నది క్వశ్చను. దీనంతటికీ రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్ నే కారణం అని కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి.
అసలు ఎన్టీఆర్ ఏ ఆలోచనతో వెళ్లారు. కేవలం రాజకీయంగా భాజపాకు బజ్ వస్తుందనే వెళ్లారా? లేక వేరేగా వినిపిస్తున్నట్లు ఆస్కార్ కు ఇండియా ఎంట్రీ ప్రయత్నాలు జరుగుతున్నాయనే గుసగుసలు కూడా వున్నాయి. వాటి గురించి వెళ్లారా? ఆస్కార్ కు ఇండియా ఎంట్రీగా ఆర్ఆర్ఆర్, ఎన్టీఆర్ పేర్లు ఫిక్స్ అయిపోయాయనే వినిపిస్తోంది. ఏదైతేనేం ఎన్టీఆర్ వెళ్లడం వల్ల భాజపాకు పెద్దగా ఒరిగేది ఏమీ వుండదు. తెలుగుదేశం పార్టీ అభిమానులు మాత్రం కాస్త దూరం ఆలోచించి భాజపా వ్యూహం ఏమిటో అని కలవరపడుతున్నారు. పురంధ్రీశ్వరి, ఎన్టీఆర్ ఇద్దరూ తెలుగుదేశం పార్టీకి వారసులే. కూతురుగా, మనవడిగా వారిద్దరికి ఆ పార్టీతో బంధం వుంది. ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు లాక్కున్నట్లే, భాజపా సహాయంతో వీళ్లు లాక్కున్నా కూడా ఎవ్వరూ మాట అనడానికి లేదు.
కానీ ఇప్పుడు ఇమ్మీడియట్ సమస్య అది కాదు. తెలంగాణ ప్రభుత్వానికి భాజపాకు చుక్కెదురు. ఇలా విజయేంద్ర ప్రసాద్, ఎన్టీఆర్, నితిన్ అంతా భాజపా వెంట వెళ్తే కచ్చితంగా కేసిఆర్ ఆగ్రహం అన్నది తప్పదు. అప్పుడే మొన్నటికి మొన్న చిన్న శాంపిల్ కూడా చూసేసారు. ఎన్టీఆర్ పేరు బాలీవుడ్ మీడియాలో మరోసారి గట్టిగా కనిపించేలా చేయాలని రాజమౌళి స్కెచ్ వేసి, బ్రహ్మస్త్ర ఫంక్షన్ కు చీఫ్ గెస్ట్ ను చేసారు. కానీ అదే వికటించి అనుమతి రాకుండా చేసిందన్నది టాలీవుడ్ టాక్.
ఈవెంట్ మేనేజ్ మెంట్
ఆ రోజు పర్మిషన్ కోసం చాలా మంది టాలీవుడ్ జనాలు ఎవరి ప్రయత్నం వారు చేసారు. కానీ టీఆర్ఎస్ టాప్ పీపుల్ అంతా ఒక్కరు కూడా ఫోన్ ఎత్త లేదు. కానీ విషయం అక్కడితో ఆగిపోలేదు. ఫంక్షన్ పర్మిషన్ కు దరఖాస్తు చేసుకున్న లెటర్..దాని మీద టైమ్ డేట్, రిజక్ట్ చేసిన టైమ్ డేట్, తమకు అందించిన టైము డేట్ ఇవన్నీ ఓ సెక్షన్ ఆఫ్ మీడియాకు అందేలా చేసారు. ఇలా ఎవరు చేసారు అన్నది తెలియదు కానీ ఆ లేఖలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యాయి.
దాంతో ఇప్పుడు పోలీసు డిపార్ట్ మెంట్ కూడా ఆగ్రహంతో వుందని టాక్ వినిపిస్తోంది. అయిదు వేల మందికి అనుమతి తీసుకుని పాతిక వేల పాస్ లు వేసినా, ఎంత మందిని డంప్ చేసినా తాము ఇన్నాళ్లు పట్టించుకోలేదని, ఒక్కసారికే ఇలా సోషల్ మీడియాకు ఎక్కేస్తారా? అని ఆగ్రహంతో వున్నట్లు సినిమా జనాలు అంటున్నారు. అసలు ఈ లేఖలు ఎలా బయటకు వెళ్లాయన్నది ప్రశ్న.
భాజపాను సినిమా జనాలు కలిసే వ్యూహానికి ఇక్కడితే పుల్ స్టాప్ పడితే ఫరవాలేదు. లేదంటే టాలీవుడ్ కు ఇబ్బంది పెరిగే అవకాశం వుంది.