మ‌మ్ముట్టీ సినిమాకు ప్రేర‌ణ ఆ టీవీ యాడ్!

ఓటీటీలో దుమ్ము రేపుతున్న మ‌ల‌యాళీ సినిమా 'న‌న్ప‌గ‌ల్ నేర‌దు మ‌య‌గం' క‌థకు ఒక టీవీ యాడ్ ప్రేర‌ణ ఉంది. ఈ విష‌యాన్ని ఈ సినిమా ద‌ర్శ‌కుడు సినిమా ఆరంభంలోనే చెప్పాడు. ఈ క‌థ తయారీకి…

ఓటీటీలో దుమ్ము రేపుతున్న మ‌ల‌యాళీ సినిమా 'న‌న్ప‌గ‌ల్ నేర‌దు మ‌య‌గం' క‌థకు ఒక టీవీ యాడ్ ప్రేర‌ణ ఉంది. ఈ విష‌యాన్ని ఈ సినిమా ద‌ర్శ‌కుడు సినిమా ఆరంభంలోనే చెప్పాడు. ఈ క‌థ తయారీకి త‌న‌కో పాత యాడ్ ప్రేరేపించింద‌ని టైటిల్ కార్డ్స్ లోనే ద‌ర్శ‌కుడు చెప్పేశాడు.

ఆ యాడ్ ఒక వుడ్ కంపెనీది. గ్రీన్ ప్లై వాళ్లు చాలా యేళ్ల కింద‌ట రూపొందించి టీవీల‌కు ఇచ్చిన యాడ్ అది. ఆ యాడ్ లో ఒక పంజాబీ కుటుంబం త‌మిళ‌నాడు మీదుగా బ‌స్ లో వెళ్తుంటుంది. త‌ల‌పాగా తో ఉన్న పంజాబీ పిల్ల‌వాడు ఉన్న‌ట్టుండి త‌మిళంలో బ‌స్ ఆపండంటూ అరుస్తాడు. త‌ల్లిదండ్రులు వారిస్తున్నా, అత‌డేం భాష మాట్లాడుతున్నాడో వారికి అర్థం కాక , అత‌డిని బ‌స్ దిగొద్దంటూ ఆపుతున్నా ఆ పిల్లాడు బ‌స్ దిగి.. రోడ్ సైడ్ నే ఉన్న ఒక పాత ఇంట్లోకి వెళ‌తాడు.

ఆ ఇంట్లో ఒక త‌మిళ కుటుంబం ఉంటుంది. ఆ ఇల్లు అంతా త‌న‌కు తెలిసిన‌ట్టుగా లోప‌ల‌కు వెళ్లి ఒక టేబుల్ ను తీస్తాడు. ఆ టేబుల్ పై సావిత్రి అని రాసిన అక్ష‌రాల‌ను త‌ర‌చి చూసుకుంటాడు. ఇంట్లో వాళ్లంతా అత‌డు ఎవ‌రో అర్థం కాక గాబ‌రా ప‌డుతూ ఉంటారు. ఇలాంటి స‌మ‌యంలో స‌ద‌రు సావిత్రి ఆ త‌న భ‌ర్త మ‌రు జ‌న్మ‌లో ఆ పంజాబీ పిల్లాడిగా పుట్టిన‌ట్టుగా గుర్తిస్తుంది. ముస‌లాయ‌న ఫొటోను చూపిస్తారు. త‌మ కంపెనీ వుడ్ తో మేజాలు, కుర్చీలు చేయించుకుంటూ జ‌న్మ‌జ‌న్మ‌ల‌కూ అలా ఉండిపోతాయ‌నేది ఆ యాడ్ సారాంశం. ఇలాంటి స‌ర‌దా యాడ్స్ కు ఫెవికాల్ పెట్టింది పేరు. ఈ ప్లైవుడ్ యాడ్ కూడా ఆ త‌ర‌హాలోనే ఉంది.

మ‌రి జ‌నాల్లో ఎంత‌మందికి ఆ యాడ్ గుర్తుందో కానీ, నెట్ ఫ్లిక్స్ లో ఆక‌ట్టుకుంటున్న మ‌ల‌యాళీ సినిమాకు ప్రేర‌ణ ఆ యాడ్ ఫిల్మేన‌ట‌. అచ్చంగా యాడ్ లో చూపిన‌ట్టుగా బ‌స్సులో ఒక కుటుంబం ప్రయాణిస్తుంటుంది. ఒక ఊరి ద‌గ్గ‌ర బ‌స్సును ఆప‌మంటూ మ‌మ్ముట్టీ దిగి, ఊర్లోకి వెళ‌తాడు. అన్నీ త‌న‌కు తెలిసిన ప‌రిస‌రాలే అన్న‌ట్టుగా ఆ ఊర్లో ఒక వ్య‌క్తిలాగా ప్ర‌వ‌ర్తించ‌డం మొద‌లుపెడ‌తాడు. అత‌డి కుటుంబంతో క‌లిసిపోయే ప్ర‌య‌త్నం చేస్తాడు. 

రెండేళ్ల కింద‌ట అదృశ్యం అయిపోయిన వ్య‌క్తిలాగా ప్ర‌వ‌ర్తించే మ‌మ్ముట్టీ పాత్ర‌ను చూసి ఆ ఇంట్లోని వాళ్లంతా అవాక్క‌వుతారు. అత‌డెవ‌రో అర్థం కాక త‌ల‌ప‌ట్టుకుంటారు. అచ్చం త‌మ వ్య‌క్తిలాగానే మాట్లాడుతున్న‌, వ్య‌వ‌హరిస్తున్న‌, ఆ జ్ఞాప‌కాల‌న్నింటినీ చెబుతున్న అత‌డిని ద‌గ్గ‌రకు తీసుకోవాలో, త‌న్ని త‌రిమేయాలో ఆ కుటుంబానికి అర్థం కాదు. మ‌ల‌యాళం త‌ప్ప మ‌రో భాష తెలియ‌ని మ‌మ్ముట్టీ పాత్ర సుంద‌రంగా మారిపోయాకా త‌న‌కు తెలియ‌ని త‌మిళం మాట్లాడుతుంది. మ‌నుషుల‌ను గుర్తుప‌డుతుంది. జ్ఞాప‌కాల‌ను చెబుతుంది. ఇలా ఈ సినిమా స్ట్రేంజ్ గా సాగుతుంది.

ఒక్క మాట‌లో చెప్పాలంటే 42 సెక‌న్ల యాడ్ లో దేన్నైతే చూపించారో, దాదాపు వంద నిమిషాల సినిమాలోనూ అదే చూపించారు! స‌హ‌జంగా, గాఢంగా! ఇక్క‌డ ద‌ర్శ‌కుడిని మెచ్చుకోవాల్సిన అంశం త‌న‌కు ప్రేరేపించిన యాడ్ గురించి ముందే చెప్ప‌డం. లేక‌పోతే.. ఇదో పెద్ద వివాదం అయ్యేది.

సినిమా విడుద‌ల అయినాకా అయినా.. ఎవ‌రో ఒక‌రు ఈ యాడ్ ను బ‌య‌ట‌కు తీసే వాళ్లు. 42 సెకెన్ల యాడ్ ను కాపీ కొట్టి వంద నిమిషాల సినిమా తీశారంటూ దుమ్ము దుమారం అయ్యేది! అయితే త‌న‌కు ప్రేరణ‌గా నిలిచిన యాడ్ ను ముందే చెప్పి ద‌ర్శ‌కుడు అభినంద‌నలు అందుకుంటున్నాడు.