“ఓ మై గాడ్ 2”.. అక్షయ్ కుమార్ నటించిన తాజా చిత్రం. అక్షయ్ కుమార్ శివుడిగా నటించిన ఈ సినిమాకు ఎ-సర్టిఫికేట్ వచ్చింది. సెన్సార్ బోర్డ్ ఏకంగా 25 మార్పులు సూచించింది. అంతేకాదు.. అక్షయ్ పాత్రను దేవుడిగా కాకుండా, దేవదూతగా చూపించాలనే సూచన కూడా చేసినట్టు కథనాలు వచ్చాయి.
ఈ వరుస కథనాల నేపథ్యంలో “ఓ మై గాడ్ 2” సినిమా వాయిదా పడే అవకాశం ఉందంటూ ఊహాగానాలు చెలరేగాయి. ఎట్టకేలకు ఈ పుకార్లన్నింటిపై సినిమా నిర్మాత అజిత్ స్పందించారు. నిన్నట్నుంచి నడుస్తున్న రూమర్లను చాలా తేలిగ్గా తీసుకున్నారాయన.
“ఓ మై గాడ్ 2” సినిమాకు సెన్సార్ క్లియరెన్స్ పూర్తయిందని, ఎలాంటి అడ్డంకులు లేకుండా 11వ తేదీన సినిమా విడుదలవుతుందంటూ క్లారిటీ ఇచ్చారు. ఎ-సర్టిఫికేట్, 25 కట్స్ లాంటి అంశాలపై పరోక్షంగా స్పందించిన ఆయన.. మేజర్ కట్స్ ఏమీ లేవని, సెన్సార్ ప్రాసెస్ లో భాగంగా కొన్ని మార్పులు చేసినట్టు వెల్లడించారు.
అక్షయ్ సినిమాపై ఆదిపురుష్ ప్రభావం..
నిర్మాత ప్రకటనతో “ఓ మై గాడ్ 2” విడుదలపై ఇన్నాళ్లూ వచ్చిన పుకార్లకు చెక్ పడింది. అసలు ఈ సినిమా సెన్సార్ పై ఇంత రాద్దాంతం జరగడానికి మెయిన్ రీజన్ ఆదిపురుష్. ప్రభాస్ సినిమా రిలీజైన తర్వాత వచ్చిన విమర్శలు, చెలరేగిన వివాదాల సంగతి తెలిసిందే. ఒక దశలో కోర్టులు సైతం సెన్సార్ బోర్డును తప్పుబట్టాయి.
ఆదిపురుష్ సినిమాకు ఎలా సెన్సార్ క్లియరెన్స్ ఇచ్చారో అర్థం కావడం లేదంటూ కోర్టులు సెన్సార్ బోర్డును మందలించాయి. ప్రజల్ని పిచ్చోళ్లు అనుకుంటున్నారా అని ప్రశ్నించాయి. దీంతో ఆ ప్రభావం, “ఓ మై గాడ్ 2” సినిమాపై పడింది. సెన్సార్ సభ్యులు ఈ సినిమాను గుచ్చిగుచ్చి చూశారు. ఏకంగా రివ్యూ కమిటీకి కూడా సిఫార్స్ చేశారు.
అందుకే “ఓ మై గాడ్ 2” సినిమా సెన్సార్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఇంత జరిగిన తర్వాత కూడా ఈ సినిమా వివాదాస్పదమైతే.. కొన్నేళ్ల పాటు ఇక ఈ తరహా చిత్రాలు రాకపోవచ్చు.