ఐశ్వర్య రాయ్ కూతురు గెలిచింది.. ఆసక్తికర తీర్పు

అందాల తార ఐశ్వర్యరాయ్, నటుడు అభిషేక్ బచ్చన్ దంపతుల గారాలపట్టి ఆరాధ్య బచ్చన్ ఆరోగ్య పరిస్థితిపై యూట్యూబ్ లో వచ్చిన తప్పుడు కథనాలపై ఢిల్లీ హైకోర్టు సీరియస్ అయింది. ఆరాధ్యపై వచ్చిన వీడియోల్ని తక్షణం…

అందాల తార ఐశ్వర్యరాయ్, నటుడు అభిషేక్ బచ్చన్ దంపతుల గారాలపట్టి ఆరాధ్య బచ్చన్ ఆరోగ్య పరిస్థితిపై యూట్యూబ్ లో వచ్చిన తప్పుడు కథనాలపై ఢిల్లీ హైకోర్టు సీరియస్ అయింది. ఆరాధ్యపై వచ్చిన వీడియోల్ని తక్షణం తొలిగించాలని గూగుల్ ను ఆదేశించింది. అంతేకాకుండా, సదరు యూట్యూబ్ ఎకౌంట్ల వివరాల్ని కూడా అందించాలని ఆదేశించింది.

కొన్ని రోజుల కిందట, కొన్ని బాలీవుడ్ యూట్యూబ్ ఛానెళ్లు ఆరాధ్య బచ్చన్ పై కథనాలు ప్రసారం చేశాయి. ఆ వీడియోల్లో ఆరాధ్య బచ్చన్ ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం బాగాలేదంటూ కొంతమంది వీడియోలు తయారుచేయగా.. మరికొన్ని యూట్యూబ్ ఛానెళ్లు మాత్రం ఆరాధ్య చనిపోయిందని, ఇంకొన్ని ఛానెళ్లు ఆరాధ్య ఆరోగ్యం విషమించిందని వీడియోలు పెట్టాయి.

వీటిపై తండ్రితో కలిసి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఆరాధ్య. మైనర్ బాలికలపై వచ్చిన ఇలాంటి కథనాలు పూర్తిగా చట్టవిరుద్ధమని కోర్టు అభిప్రాయపడింది. దేశంలో ప్రతి బిడ్డను గౌరవించాల్సిన అవసరం అందరిపై ఉందని, ఇలాంటి కథనాలు వక్రబుద్ధిని ప్రతిబింబిస్తాయని, చట్టప్రకారం సహించరానివని కోర్టు తెలిపింది.

ఆరాధ్యపై అసత్య ప్రచారం చేసిన 9 యూట్యూబ్ ఛానెళ్లను కోర్టు పూర్తిగా నిషేధించింది. ఇకపై ఆ అకౌంట్స్ నుంచి ఏ సామాజిక మాధ్యమంలో ఎలాంటి కథనాలు రావడానికి వీల్లేదని, ఛానెళ్లు నడుస్తున్నట్టు తెలిస్తే చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది.