ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమా ప్రకటన చాన్నాళ్ల కిందటే వచ్చింది. అయితే సినిమా ప్రీ-ప్రొడక్షన్ మాత్రం స్టార్ట్ కాలేదు. యానిమల్ సినిమా హంగామా ముగియడం, మరోవైపు ప్రభాస్ కూడా కల్కి సినిమా షూటింగ్ ను కొలిక్కి తీసుకురావడంతో… స్పిరిట్ పై చర్చ ఎక్కువైంది.
ఈ డిస్కషన్ కు తగ్గట్టుగానే, ఎప్పటికప్పుడు సినిమాపై అప్ డేట్స్ ఇచ్చుకుంటూ వస్తున్నాడు దర్శకుడు. ఈ సినిమాలో ప్రభాస్ పోలీసాఫీసర్ గా కనిపిస్తాడని ఇప్పటికే ప్రకటించాడు. తన సినిమాల్లో హీరోలంతా ధనిక కుటుంబం నుంచి వస్తారని, కానీ స్పిరిట్ లో మాత్రం హీరో మధ్యతరగతి కుటుంబం నుంచి వస్తాడనే క్లారిటీ కూడా ఇచ్చాడు.
ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ మీద బిజీగా ఉన్న ఈ దర్శకుడు, ఈరోజు మరో అప్ డేట్ ఇచ్చాడు. ఈ ఏడాది చివరి నాటికి ప్రభాస్ తో కలిసి సెట్స్ పైకి వెళ్తానని ప్రకటించాడు. గామి ట్రయిలర్ లాంఛ్ కు ప్రత్యేక అతిథిగా వచ్చిన వంగ, ఈ ప్రకటన చేశాడు.
సాధారణంగా తన ప్రతి సినిమా స్క్రిప్ట్ కు అటుఇటుగా 6 నెలల టైమ్ తీసుకుంటాడు ఈ డైరక్టర్. సో.. ఈ లెక్కన చూసుకున్నా ఈ ఏడాది చివరి నాటికి ప్రభాస్ తో సినిమా సెట్స్ పైకి రావడం ఖాయం. పైగా అగ్రిమెంట్ల విషయంలో పక్కాగా ఉండే టీ-సిరీస్ బ్యానర్ పై వస్తున్న సినిమా కావడంతో.. హీరో అయినా, డైరక్టర్ అయినా టైమ్ లైన్స్ ను ఠంచనుగా పాటించాల్సిందే.