గత ఏడాది వచ్చిన కళాఖండాల్లో ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్ వన్, వినయవిధేయరామ.. ఈ రెండు సినిమాలూ ముఖ్యమైనవి! ఏడాది ఆరంభంలోనే సంక్రాంతి సీజన్లో ఈ సినిమాలు విడుదల అయ్యాయి. వాటికి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో చెప్పనక్కర్లేదు. ఎన్టీఆర్ బయోపిక్ ను భారీ బడ్జెట్ తో రూపొందించారు. తండ్రి పాత్రలో బాలకృష్ణ నటించే ప్రయత్నం చేశారు. అయితే ఆ ప్రయత్నం గట్టిగా వికటించింది.
ఎన్టీఆర్ ఈ పాటి నటుడేనా.. అంటూ ప్రేక్షకులే నోరెళ్ల బెట్టాల్సి వచ్చింది. ఆ స్థాయిలో వచ్చింది ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్ వన్ ఔట్ పుట్! ఇక ఎన్టీఆర్ ను గొప్పవాడిగా చూపడానికి కొన్ని అబద్ధాలను కూడా చూపించారనే విమర్శలూ తప్పలేదు. ఏ రకంగా చూసుకున్నా.. విశ్వ నటసార్వభౌముడి స్థాయికి ఏ మాత్రం మ్యాచ్ కాలేదు ఆ బయోపిక్.
ఆ సినిమా వచ్చి ఏడాది అయ్యిందంటూ… వారం నుంచి నెట్ లో ట్రోలింగ్ కొనసాగుతూ ఉంది. అప్పట్లో ఆ సినిమాపై పెట్టిన సెటైరిక్ పోస్టులను నెటిజన్లు ఇప్పుడు షేర్ చేస్తున్నారు. ఏడాది అయ్యిందంటూ.. దెప్పి పొడుస్తూ ఉన్నారు.
అలాగే అదే సీజన్లో వచ్చిన బోయపాటి మార్కు కళాఖండం వినయవిధేయరామ కూడా ఏడాదిని పూర్తి చేసుకుంది. బోయపాటి సినిమాలో కొన్ని ఎన్నోహాస్యాస్పదమైన సీన్లు ఉన్నాయి. వాటిని షేర్ చేస్తున్నారు జనాలు. అప్పట్లోనే ఆ సీన్లు నవ్వులపాలయ్యాయి. ఇప్పటికీ అవి కామెడీని పంచుతూ ఉన్నాయి. మొత్తానికి ఒక సినిమా హిట్ అయితే అది విడుదలై ఏడాది అంటూ పోస్టులు కనిపించేవి. ఫట్ మన్న సినిమాలను జనాలు అంతటితో వదిలేసే వాళ్లు. అయితే ఎన్టీఆర్ బయోపిక్, వినయ విధేయ రామ.. ఈ రెండు సినిమాలూ మాత్రం ఏడాదైనా సెటైర్ లకు అవకాశం ఇస్తూనే ఉన్నట్టున్నాయి!