ఓవర్సీస్లో పెద్ద చిత్రాలకి గతంలో పలికిన రేట్లకి సగం ఆఫర్ చేస్తున్నారు బయ్యర్లిపుడు. ఆఫర్లు తగ్గిపోవడం, మూవీపాస్ లేకపోవడం కొన్ని కారణాలయితే ప్రధానంగా ఓవర్సీస్ బిజినెస్‌ని ప్రభావితం చేస్తోంది అమెజాన్ ప్రైమ్. ఏ చిత్రాన్ని అయినా అమెజాన్ కొన్నదంటే ఇక దాని కోసం థియేటర్లకి వచ్చే వారి సంఖ్య తగ్గిపోతోంది. మరీ సినిమా చూడకుండా ఉబలాటం ఆపుకోలేని వారు మినహా చాలా మంది థియేటర్లకి రావడం లేదు.
థియేటర్లకి వచ్చి వందల డాలర్లు ఖర్చు పెట్టుకోవడం కంటే నెల రోజులు ఆగితే 4కె రిజల్యూషన్‌లో ఇంట్లోనే హోమ్ థియేటర్లో సినిమా చూసుకోవచ్చు. ఎన్నిసార్లంటే అన్ని సార్లు రిపీట్లు వేసుకుని మరీ సినిమాని ఎంజాయ్ చేయవచ్చు. దీంతో థియేటర్లకి వచ్చే ఫ్యామిలీ ఆడియన్స్ సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. అలాగే ఒకసారి చూసి సరిపెట్టుకోని రిపీట్ ఆడియన్స్‌పై కూడా అమెజాన్ ప్రైమ్ ప్రభావం చూపిస్తోంది.
మరీ నాలుగు వారాలు తిరగకుండా కొన్ని సినిమాలు ప్రైమ్‌లో వచ్చేస్తూ వుండడంతో సినిమా బిజినెస్ మరింత కుదేలవుతోంది. ఈ ప్రభావం ఓవర్సీస్లోనే కాకుండా స్థానికంగాను బాగానే పడుతోంది. సిటీస్‌లో రిపీట్ ఆడియన్స్ బాగా తగ్గిపోయారు. హాలీవుడ్ బ్లాక్బస్టర్లని మూడు, నాలుగు నెలలు ఒక్కోసారి ఆరు నెలల తర్వాత కానీ స్ట్రీమ్ చేయరు. కానీ తెలుగు సినిమాలకి ఈ జాఢ్యం ఏమిటని బయ్యర్లు గగ్గోలు పెడుతున్నారు.