హీరోయిన్ నిశ్చితార్థం పూర్తి.. పెళ్లికి రెడీ!

అంతా ఊహించినట్టుగానే హీరోయిన్ పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా పెళ్లికి రెడీ అయిపోయారు. రాత్రి వీళ్ల నిశ్చితార్థం ఢిల్లీలో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్…

అంతా ఊహించినట్టుగానే హీరోయిన్ పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా పెళ్లికి రెడీ అయిపోయారు. రాత్రి వీళ్ల నిశ్చితార్థం ఢిల్లీలో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హాజరయ్యారు. అటు పరిణీతి అక్క ప్రియాంక చోప్రా, వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గుంభనంగా జరిగిన ఈ కార్యక్రమానికి కేవలం 150 మంది మాత్రమే హాజరయ్యారు.

కొన్ని నెలల కిందట తమ మధ్య ఉన్న రిలేషన్ షిప్ ను బయటపెట్టారు పరిణీతి-రాఘవ్. ఇద్దరూ కలిసి మీడియాకు కనిపించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఓ ఐపీఎల్ మ్యాచ్ కు కూడా హాజరయ్యారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న తర్వాతే ఇద్దరూ ఇలా బయటపడ్డారు.

సిక్కు సంప్రదాయ పద్ధతిలో వీళ్ల నిశ్చితార్థం జరిగింది. ఈ ఏడాదిలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతోంది. పెళ్లి తేదీని త్వరలోనే బయటపెడతారు. ఇది డెస్టినేషన్ వెడ్డింగ్ కాదు, పెళ్లి ఇండియాలోనే జరుగుతుంది.

పరిణీతి-రాఘవ్ ఒకే కాలేజీలో చదువుకున్నారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ లో పట్టా తీసుకున్నారు. ఆ తర్వాత ఎవరి రంగాల్లో వాళ్లు బిజీ అయ్యారు. 2011లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది పరిణీతి. అటు రాఘవ్ ఓవైపు తన ఫ్యామిలీ బిజినెస్ పనులు చూసుకుంటూనే, మెల్లగా ఆమ్ ఆద్మీ పార్టీ వైపు వచ్చాడు. ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్నారు.