రికార్డ్.. నంబర్ వన్ సినిమాగా పఠాన్

అందరూ ఊహించినట్టే జరిగింది. బాలీవుడ్ నంబర్ వన్ మూవీగా పఠాన్ అవతరించింది. షారూక్ హీరోగా నటించిన ఈ సినిమా నిన్నటి వసూళ్లతో కలుపుకొని 511 కోట్ల 70 లక్షల రూపాయలు (కేవలం హిందీ వెర్షన్)…

అందరూ ఊహించినట్టే జరిగింది. బాలీవుడ్ నంబర్ వన్ మూవీగా పఠాన్ అవతరించింది. షారూక్ హీరోగా నటించిన ఈ సినిమా నిన్నటి వసూళ్లతో కలుపుకొని 511 కోట్ల 70 లక్షల రూపాయలు (కేవలం హిందీ వెర్షన్) వసూలు చేసింది. దీంతో హిందీలో నంబర్ వన్ మూవీగా నిలిచింది.

ఇన్నాళ్లూ ఈ ఘనత రాజమౌళి తీసిన బాహుబలి-2 పేరిట ఉండేది. ఆ సినిమా హిందీ వెర్షన్ కు లైఫ్ టైమ్ కలెక్షన్ కింద 511 కోట్ల రూపాయలు వచ్చాయి. ఇప్పుడీ సినిమాను పఠాన్ అధిగమించింది.

విడుదలైన 38 రోజుల్లో ఈ ఘనత సాధించింది పఠాన్ మూవీ. ఈ సినిమాకు వసూళ్ల రావడానికి ఇంకా స్కోప్ ఉంది. ఎందుకంటే, బాలీవుడ్ లో మరో పెద్ద సినిమా లేదు. ఈ వీకెండ్ గడిచేసరికి సినిమాకు అదనంగా కనీసం 2 కోట్ల రూపాయలు రావొచ్చని ట్రేడ్ అంచనా వేస్తోంది. ఓపెన్ వీకెండ్ కు తోడు, తగ్గిన టికెట్ ధరలు, ఆఫర్లు కొనసాగుతుండడంతో.. మరో హిందీ సినిమాకు అందని రేంజ్ లో పఠాన్ వసూళ్లు ఉండొచ్చని భావిస్తున్నారు.

దాదాపు అర్థ దశాబ్దం తర్వాత షారూక్ ఖాన్ రీఎంట్రీ ఇచ్చిన సినిమా కావడంతో ఆ సెంటిమెంట్ బలంగా పనిచేసింది. దీనికితోడు, బాలీవుడ్ బాక్సాఫీస్ కరువులో ఉండడం, మంచి యాక్షన్ సినిమా ఈమధ్య కాలంలో రాకపోవడం, బేషరమ్ సాంగ్ వివాదం లాంటి ఎన్నో అంశాలు పఠాన్ కు కలిసొచ్చాయి.