మొన్నటికిమొన్న ప్రభాస్ సినిమా విషయంలో అతడి ఫ్యాన్స్ ఎంత హంగామా చేశారో అందరం చూశాం. ఎప్పటికీ ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్ చేయకపోవడంతో తామే రాధేశ్యామ్ అనే టైటిల్ ను ఓన్ చేసుకొని దాన్ని ట్రెండ్ చేసి పడేశారు. ఆ టైటిల్ కాస్తా బాగా పాపులర్ అవ్వడంతో, తప్పనిసరి పరిస్థితుల్లో మేకర్స్ కూడా అదే టైటిల్ కు ఫిక్స్ అవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు పవన్ సినిమా విషయంలో కూడా ఇలానే జరిగేలా ఉంది.
పవన్-క్రిష్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీకి విరూపాక్షి అనే టైటిల్ అనుకుంటున్నారు. అయితే ఫ్యాన్స్ కు ఇది నచ్చలేదు. ఓ మాస్ టైటిల్ కావాలని వాళ్లు
చాన్నాళ్లుగా పట్టుబడుతున్నారు. ఈ మేరకు క్రిష్ కూడా మరో క్యాచీ టైటిల్ వెదికే పనిలో పడ్డాడు.
అయితే అంతలోనే పవన్ ఫ్యాన్స్ రంగంలోకి దిగిపోయారు. బందిపోటు అనే టైటిల్ కు భారీ ఎత్తున ప్రచారం కల్పిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా బందిపోటు హ్యాష్ ట్యాగ్ కనిపిస్తోంది. అంతేకాదు, పవన్-క్రిష్ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ఏ చిన్న చర్చ జరిగినా.. దానికి బందిపోటు టైటిల్ ఆపాదిస్తున్నారు ఫ్యాన్స్.
పవన్ ఫ్యాన్స్ చేసిన పనితో క్రిష్ ఇప్పుడు కార్నర్ అయ్యాడు. బందిపోటు టైటిల్ కు బాగా ప్రచారం రావడంతో, క్రిష్ ఇక ఆ టైటిల్ కే ఫిక్స్ అవ్వక తప్పని పరిస్థితి.
మొఘల్ కాలం నాటి కథతో తెరకెక్కుతోంది ఈ సినిమా. ఇందులో పవన్ వజ్రాల దొంగగా కనిపించబోతున్నాడట. కాబట్టి బందిపోటు అనే టైటిల్ బాగానే ఉంటుంది. గతంలో సీనియర్ ఎన్టీఆర్ ఇదే టైటిల్ తో ఓ సినిమా చేశారు.