నిర్మాతల ఎదురుచూపులు ఫలించాయి. ఎట్టకేలకు పవన్ కల్యాణ్ హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యారు. ఇక్కడివరకు బాగానే ఉంది. హైదరాబాద్ వచ్చిన పవన్ కల్యాణ్, తిరిగి తన సినిమాల షూటింగ్స్ స్టార్ట్ చేస్తారా? చేస్తే ఏ సినిమాకు కాల్షీట్లు ఇస్తారు? ఇది ఇప్పుడు కొత్త ప్రశ్న.
ప్రస్తుతం పవన్ చేతిలో ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు సినిమాలున్నాయి. వీటిలో కాస్త అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్న సినిమా ఓజీ మాత్రమే. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగం పూర్తయింది. పవన్ కల్యాణ్ మరోసారి కాల్షీట్లు కేటాయిస్తే, షూటింగ్ ను పరుగులు పెట్టించడానికి దర్శకుడు సుజీత్, పక్కా ప్లాన్ తో రెడీగా ఉన్నాడు.
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాకే పవన్ కాల్షీట్లు కేటాయించే అవకాశం ఉంది. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హస్మి, టాలీవుడ్ కు పరిచయమౌతున్నాడు.
పవన్ చేయాల్సిన మరో ప్రాజెక్టు ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమాకు సంబంధించి ఒక షెడ్యూల్ పూర్తిచేశాడు పవన్. ఆ షెడ్యూల్ లో తీసిన విజువల్స్ తో గ్లింప్స్ కూడా రిలీజ్ చేసింది యూనిట్. ఆ తర్వాత మళ్లీ ఇప్పటివరకు మరో షెడ్యూల్ స్టార్ట్ కాలేదు. పవన్ కాల్షీట్ల కోసం దర్శకుడు హరీశ్ శంకర్ వెయిటింగ్.
పైన చెప్పుకున్న 2 సినిమాల కంటే ముందు ప్రారంభమై, అన్నింటికంటే ఆలస్యంగా నడుస్తోంది హరిహర వీరమల్లు సినిమా. క్రిష్ దర్శకత్వంలో, ఏఎం రత్నం నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ విడతలోనైనా ఈ సినిమాకు కాల్షీట్లు దక్కుతాయేమో లేదో చూడాలి.