సోషల్ మీడియాలో తాము ఏం షేర్ చేస్తే తమకు అలాంటి ఇమేజ్ వస్తుందని నమ్మే వారు కొందరుంటారని అంటారు సైకాలజిస్టులు. 'ఐడెంటిటీ క్రైసిస్' అంటూ ఈ జాడ్యాన్ని అభివర్ణిస్తూ ఉంటారు మానసిక విశ్లేషకులు. తమను తాము మేధావులుగా సోషల్ మీడియాలో ప్రజెంట్ చేసుకోవడానికి వాళ్లు రకరకాల పాట్లు పడుతూ ఉంటారనే విశ్లేషణలున్నాయి. తమకు ఉత్తమ అభిరుచులు ఉన్నట్టుగా చూపించుకోవడానికి ఈ కేటగిరి జనాలు పాకులాడుతూ ఉంటారు. ఇదంతా వాస్తవం కాదని, కేవలం ఎదుటి వాళ్ల దృష్టిలో పడటానికే అలాంటి ప్రయత్నాలు చేసే వాళ్లు చాలా మంది ఉంటారని మానసిక విశ్లేషకులు చెబుతుంటారు.
ఇక సోషల్ మీడియాలో పెట్టే పోస్టులకూ వాస్తవానికీ సంబంధం ఉండదని ఈ మధ్యకాలంలో యువతీయువకులకు కూడా బాగా తెలిసి వచ్చింది. తెల్లారుజామునే బెడ్ మీద నుంచి కొందరు ఫొటోలు తీసుకున్నట్టుగా పోస్టు చేసే పోజులు కూడా అప్పటికే ఫ్రెషప్ అయ్యి మళ్లీ బెడ్ మీదకు ఎక్కి తీసుకునే సెల్ఫీలు అన్నట్టుగా కొన్ని సెటైరికల్ వీడియోలూ కనిపిస్తూ ఉంటాయి. ఒకరకంగా తమ గురించి ఎదుటి వాళ్లు ఏదో ఊహించుకోవడానికి జరిగే మ్యానిపులేషనే ఇదంతా అనే అభిప్రాయాలు జనాలకూ బలంగా ఏర్పడ్డాయి.
ఇప్పుడా.. సోషల్ మీడియా వేషాలను, హై క్లాస్ అనిపించుకోవడానికి ఇచ్చే పోజులను జనాలు పదేళ్ల నుంచి చూస్తున్నారు! ఇలాంటి సమయంలో పవన్ కల్యాణ్ పుస్తకాల పోజులు కామెడీగా మారుతున్నాయి. ఇది తొలి సారి కాదు, బహుశా చివరి సారి కాకపోవచ్చు.. పవన్ కల్యాణ్ ఏదో పుస్తకం పట్టుకుని సీరియస్ పోజు ఇవ్వడం ఆ ఫొటోలను మీడియాకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది.
ఒక్క మాటలో చెప్పాలంటే.. నిజంగా గొప్ప గొప్ప పుస్తకాలు చదివే మెచ్యూరిటీ ఉన్న వాళ్లు ఎవరూ ఇలా పుస్తకాలు చదువుతున్నట్టుగా పోజులిస్తూ ఫొటోలు తీయించుకోరు అనేది నిశ్చితమైన అభిప్రాయం. తాము పుస్తకాలు చదువుతాం అంటూ ప్రచారం పొందాలనుకునే వాళ్లే ఇలా ఎక్కడబడితే అక్కడ పుస్తకాలు పట్టుకుని పోజులిచ్చి ప్రచారం పొందాలని చూస్తారనేది సామాన్యుడు కూడా చేయగల మానసిక విశ్లేషణ. పుస్తకాలను అమ్ముకునే వాళ్లు, పుస్తకాలు చదివే మేధావులుగా కలరింగ్ ఇచ్చుకునే వాళ్లే ఇలాంటి ఐడెంటెటీ క్రైసిస్ పోజులు ఇస్తారని విశ్లేషించవచ్చు. పవన్ కల్యాణ్ కేమిటీ ఐడెంటిటీ క్రైసిస్ ఏమిటి? అంటారా.. పవన్ కు హీరోగా బోలెడంత ఇమేజ్ ఉంది. అయితే ఆయన తను మేధావి అనిపించుకోవాలని, పుస్తకాలు మహగొప్పగా చదువుతాడు.. అనిపించుకోవాలని తాపత్రయపడుతున్నట్టున్నారు. అందుకే ఈ పుస్తకాల పాట్లు!