ఆంధ్రలో రాజధానులను మూడుగా విభజించారు. దీని మీద ప్రతిపక్షాలు యాగీచేస్తున్నాయి. కానీ ఈలోగా జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ తన కార్యక్రమాలను కూడా మూడు రకాలుగా విడదీసినట్లు తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన డేట్ లను సమానంగా విడదీసారు.
ఆయన కూడా ఇకపై పది పది రోజుల వంతున మూడు చోట్ల వుండబోతున్నారు. పది రోజులు పింక్ రీమేక్ షూట్ లో వుంటారు. ఆపైన పది రోజులు డైరక్టర్ క్రిష్ చేయబోయే సినిమా షూట్ లో వుంటారు. ఆపైన మరో పది రోజలు రాజకీయాలకు కేటాయిస్తారు.
అంటే నెలలో మూడు పదులను ఈ విధంగా పవన్ కళ్యాణ్ ప్లాన్డ్ గా విభజించారన్నమాట. ఎలాగైనా మే నెలలో పింక్ రీమేక్ ను, ఆ తరువాత సంక్రాంతికి క్రిష్ సినిమాను విడుదల చేయాలన్నది పవన్ సంకల్పంగా తెలుస్తోంది.
లీకులు అరికట్టండి
ఎక్కడపడితే అక్కడ నిన్నటికి నిన్న పవన్ షూటింగ్ ఫొటోలు దర్శనమిచ్చాయి. దీంతో జనాలు పవన్ షూటింగ్ ల్లో ఫుల్ బిజీ అయిపోయారని డిసైడ్ అయిపోతున్నారు. ఇలాంటి నేపథ్యంలో సోషల్ మీడియాలో ఎక్కడ ఫొటోలు కనిపించినా వాటిని డిలీట్ చేయించే పని మొదలయింది.
నిర్మాత దిల్ రాజు డిజిటల్ టీమ్, ట్విట్టర్ లో, యూ ట్యూబ్ లో ఎక్కడ ఈషూటింగ్ ఫొటోలు కనిపించినా అర్జెంట్ గా డిలీట్ చేయిస్తోంది. అయినా అవి సర్క్యులేట్ అవుతూనే వున్నాయి. అయినా పవన్ షూటింగ్ చేస్తే తప్పు లేదు కానీ జనం ఆ ఫొటోలు చలామణీ చేస్తే తప్పా?