గబ్బర్ సింగ్ సిరీస్ తరువాత మళ్లీ మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోలీస్ గా కనిపించబోతున్నారు. వాస్తవానికి డైరక్టర్ హరీష్ శంకర్ సినిమాలోనే పవన్ పోలీస్ గా కనిపిస్తారని అభిమానులు అంతా అనుకున్నారు. కానీ ఆ లోగానే ఆ కోరిక తీరుతోంది. ముందే వార్తలు వచ్చినట్లు అయ్యప్పన్ కోషియమ్ సినిమా రీమేక్ కు పవన్ ఓకె చెప్పేసారు. ఈ రోజు అనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది.
ఈ సందర్భంగా చిన్న విడియో కూడా వదిలారు. థమన్ బ్యాక్ గ్రవుండ్ స్కోర్ అందించారు ఈ విడియోకి. ఇందులో జస్ట్ అనౌన్స్ మెంట్ మాత్రమే వుంది. అయ్యప్పన్ సంగతి లేదు. థమన్, ప్రసాద్ మూరెళ్ల, ప్రకాష్ లాంటి టెక్నీకల్ కాస్టింగ్ వుంది. థమన్ మొత్తానికి మరోసారి పవన్ సినిమాకు మ్యూజిక్ ఇస్తున్నారు.
పవన్ మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తరువాత హారిక హాసినితోనే తొలి సినిమా వుంటుందని అనుకున్నారంతా. ఆ సంస్థతో పవన్ కు వున్న అనుబంధం అలాంటిది. కానీ అలా జరగలేదు. అయితే ఇప్పుడు ఆకస్మికంగా పవన్ సినిమా అదే బ్యానర్ కు చెందిన సితారతో ప్రకటించేసారు.
రీఎంట్రీ తొలిసినిమా వకీల్ సాబ్ తరువాత వచ్చే సినిమా ఇదే కావడం విశేషం. అవును ఇంతకీ హరీష్ శంకర్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోసం పోలీస్ స్టోరీనే అల్లుతారా? వేరే కథ చేస్తారా? వేచి చూడాల్సిందే.