జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ రాజకీయ పనుల్లో ఫుల్ బిజీగా వున్నారు. తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నాయి. అభ్యర్ధులను ఫిక్స్ చేయాలి. ఒకటి రెండు చోట్ల అయినా ప్రచారం చేయాలి. మోడీ సభలో పాల్గొనాలి. 9 నుంచి ఆంధ్రలో ఉమ్మడి కార్యాచరణ వుంది. ఆ పనులు చూడాలి. తెలంగాణ ఫలితాలు వచ్చాక పరిస్థితులు సమీక్షంచుకోవాలి. అంటే ఇవన్నీ కలిసి నవంబర్, డిసెంబర్ నెలల డేట్‌లు అన్నీ తీసేసుకుంటాయి.
జనవరి నుంచి ఆంధ్ర ఎన్నికల హడావుడి మొదలవుతుంది. ఇప్పటికే గట్టిగా మొదలైపోయింది చంద్రబాబు అరెస్ట్ కారణంగా. ఈ వేడి అలా అలా పెరుగుతూనే వుంటుంది. అందువల్ల పవన్ ఇకపై ఆంధ్రలోనే పార్టీ నాయకులకు అందుబాటులో వుండాల్సి వుంటుంది. అన్ని జిల్లాల్లో పార్టీ నిర్మాణం, బలోపేత దిశగా వర్క్ చేయాల్సి వుంటుంది. అందువల్ల సినిమాలకు డేట్ లు అంటే కష్టమే.
రెండు సినిమాలు సెట్ మీద వున్నాయి. ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్. ఈ రెండూ విడుదలయ్యేది ఆంధ్రలో ఎన్నికల తరువాతే. అందువల్ల ఆంధ్ర ఎన్నికల లోపు పవన్ సెట్ మీదకు వస్తారా? అన్నది అనుమానం. పైగా ఎన్నికలు అయిన తరువాత పాజిటివ్ ఫలితాలు వచ్చినా కూడా టైమ్ పడుతుంది.
ఎందుకంటే తేదేపా పొత్తుతో ప్రభుత్వం అన్నపుడు మంత్రి పదవులు, ఈక్వేషన్లు, సెలక్షన్ ఇలాంటివి అన్నీ వుంటాయి. అవన్నీ సెట్ అయిన తరువాతం కాస్త ఫ్రీ అవుతారు. అంటే కనీసం జూన్ 2024 అని లెక్క వేసుకోవచ్చు.