తనకు ఎలాగూ ఫ్యాన్ బేస్ ఉంది. కానీ మిగతా హీరోల అభిమానుల్ని కూడా తనవైపు తిప్పుకోవడం పవన్ కల్యాణ్ ఎజెండాగా కనిపిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఆయన మహేష్ బాబు అభిమానులకు ఓసారి బిస్కెట్ వేశారు. తనకంటే మహేష్ పెద్ద స్టార్ అన్నారు, మహేష్ తనకంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటాడని కూడా చెప్పుకొచ్చారు.
బ్రో మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ వేదికగా మిగతా హీరోల అభిమానుల్ని కూడా తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు పవన్ కల్యాణ్. ఈసారి మరిన్ని స్టేట్ మెంట్స్ గుప్పించారు.
“నాకు హీరోలందరూ ఇష్టమే. హీరోలంతా కష్టపడతారు. ప్రభాస్, రానా తరహాలో ఏళ్ల తరబడి కష్టపడడం నాకు రాదు. ఎన్టీఆర్, రామ్ చరణ్ లా నేను డాన్సులు చేయలేను.”
పవన్ కల్యాణ్ తాజా స్టేట్ మెంట్స్ ఇవి. మొన్నటికిమొన్న మహేష్ అభిమానుల్ని ఆకర్షించిన పవన్, ఇప్పుడు ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి హీరోల ఫ్యాన్స్ ను కూడా ఎట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్, బాహుబలి లాంటి సినిమాల్ని తను చేయలేనని కూడా పరోక్షంగా చెప్పేశారు.
“ఆర్ఆర్ఆర్, బాహుబలి లాంటి హిట్స్ కొట్టాలని ఉంటుంది.. పూర్తిగా సినిమాల్లోనే ఉంటే కొట్టేవాడినేమో.” అంటూ చెప్పుకొచ్చారు పవన్. ఈ స్టేట్ మెంట్స్ తో ఎన్టీఆర్, ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పండగ చేసుకుంటున్నారు. పవన్ కు కావాల్సింది కూడా అదే కదా.
ఈ సందర్భంగా మరోసారి మహేష్ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు పవన్. తనకు చిరంజీవి తర్వాత కృష్ణ అంటే చాలా అభిమానం అన్నారు. రాజమౌళి-మహేష్ సినిమా అంతర్జాతీయ స్థాయిలో నిలబడాలని కోరుకున్నారు. ఈ రెండు స్టేట్ మెంట్స్ చాలు, మహేష్ ఫ్యాన్స్ పడిపోవడానికి.
ఇలా మేజర్ ఫ్యాన్ బేస్ ఉన్న హీరోలందరినీ కవర్ చేశారు పవన్ కల్యాణ్. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఈమధ్య తన ప్రసంగాల్లో ఇతర హీరోల ప్రస్తావనను ఆయన ఎక్కువగా తీసుకొస్తున్నారు. హీరోలందరూ ఇష్టం అంటూనే.. మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోల అభిమానుల్ని తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.