బిగ్ బాస్ లీకుల గోలలు హీరోయిన్లను వదిలిపెట్టడం లేదు. కొత్త సీజన్ మొదలవ్వడం ఆలస్యం, హీరోయిన్ల చుట్టూ ఒకటే పుకార్లు, ఇంకెన్నో ఊహాగానాలు. ఇప్పటికే భూమికపై ఇలాంటి పుకార్లు చాలా వచ్చాయి. తాజాగా ఆమె వాటిని ఖండించింది. ఇప్పుడు పాయల్ రాజ్ పుత్ వంతు వచ్చింది.
హిందీ బిగ్ బాస్ కోసం భూమికను సంప్రదించినట్టు పుకార్లు వస్తే.. తెలుగు బిగ్ బాస్ కోసం పాయల్ కు ఆఫర్ చేసినట్టు 2 రోజుల కిందట్నుంచే రూమర్లు మొదలయ్యాయి. సీజన్-5 ప్రారంభం రోజునే సూట్ కేస్ తో పాటు పాయల్ ను హౌజ్ లోకి పంపిస్తారంటూ కొందరు వాదిస్తే.. సీజన్ స్టార్ట్ అయిన కొన్ని రోజులకు వైల్డ్ కార్డ్ కింద పాయల్ బిగ్ బాస్ హౌజ్ లో అడుగుపెడుతుందని మరికొందరు చెప్పుకొచ్చారు.
ఈ మొత్తం చర్చకు పాయల్ ఫుల్ స్టాప్ పెట్టింది. తను తెలుగు బిగ్ బాస్ కొత్త సీజన్ లో భాగం కాదని తేల్చిచెప్పేసింది. ” బిగ్ బాస్ సీజన్-5 తెలుగులో నేను భాగం కాదు. ఇది ఫేక్ న్యూస్. దయచేసి నన్ను ఇలాంటి రూమర్లలోకి లాగొద్దు.” అంటూ ప్రకటించింది.
రీసెంట్ గా ఓ పెద్ద మూవీలో ఆమె ఐటెంసాంగ్ చేయబోతున్నట్టు వార్తలొచ్చాయి. వాటిని ఆమె ఖండించిన కొన్ని రోజులుకే ఇలా బిగ్ బాస్ పుకార్లు చెలరేగాయి. వీటిపై కూడా పాయల్ స్పష్టత ఇవ్వడంతో ప్రస్తుతానికి ఆమెపై రూమర్లు ఆగిపోయాయి.