రామ్ గోపాల్ వర్మ సినిమా 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమాకు అసలు సెన్సార్ సర్టిపికెట్ ఇవ్వకూడదని, ఆ సినిమా కమ్మ సామాజికవర్గం మనోభావాలను దెబ్బతీసేలా ఉందని.. ఒక వ్యాపార వేత్త కోర్టుకు ఎక్కారు.
తెలంగాణ హై కోర్టులో ఆ సినిమా విడుదల పై స్టే కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ వారంలోనే ఆ సినిమాను విడుదల చేస్తానంటూ ఆర్జీవీ ప్రకటించారు.
ఇప్పటికే ఆ సినిమాపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ సినిమా విడుదలను ఆపాలంటూ పిటిషన్ దాఖలు కావడం ఆసక్తిదాయకంగా మారింది. ఇంద్రసేన చౌదరి అనే వ్యాపారి ఈ సినిమాపై పిల్ దాఖలు చేసినట్టుగా సమాచారం.
ఈ సినిమా కమ్మ వాళ్ల మనోభావాలను దెబ్బతీస్తోందని పేర్కొన్న పిటిషనర్ అలాగే ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్, సినీ నటుడు పవన్ కల్యాణ్ లను కూడా ఈ సినిమాలో అవమానించారని పేర్కొన్నారు.
'పప్పులాంటి అబ్బాయి..' పాటతో లోకేష్ ను ఇబ్బంది పెట్టారని, ఇలాంటి సినిమా విడుదల చేయడానికి వీల్లేదని పిటిషనర్ పేర్కొన్నాడు.
ఈ సినిమా ప్రకటన వచ్చినప్పుడే ఇలాంటి పిటిషన్లకు అవకాశం ఏర్పడింది. మరి ఈ విషయంలో కోర్టు ఎలా స్పందిస్తుందో!