పవన్ కల్యాణ్ వీరాభిమానులు వాస్తవాలను గ్రహించలేరేమో ఎప్పటికీ. రాజకీయం విషయంలోనే అనుకుంటే ఈ జాడ్యం సినిమాలకు కూడా పాకింది. పవన్ కల్యాణ్ ను ఎప్పుడో దేముడు చేసిన వీరాభిమానులు ఈ వెర్రితనంతో విడ్డూరంగా వ్యవహరించడం కొత్త కాదు. ఈ ప్రహసనాలు ఎప్పటికప్పుడు ఎలాగోలా కొనసాగుతూనే ఉంటాయి. ఈ క్రమంలో తమిళ ఖుషీని వీరు ట్రోల్ చేస్తున్న తీరు విడ్డూరంగా ఉంది.
ఇంతకీ వీరికి వచ్చిన కొత్త బాధ ఏమిటంటే.. పవన్ కల్యాణ్ నటించిన ఖుషీ అద్భుతంగా ఉందట, అదే తమిళ ఖుషీ మాత్రం బాగుండదట. పవన్ కల్యాణ్ ఎక్స్ ప్రెషన్లు అద్భుతంగా ఉంటే, విజయ్ ఎక్స్ ప్రెషన్లు టార్చర్ అట. సోషల్ మీడియా ఈ మేరకు తమిళ ఖుషీ, తెలుగు ఖుషీ సినిమా కు సంబంధించిన వీడియోలను చూపుతూ వీరు ట్రోల్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ వీరాభిమానులు గ్రహించాల్సింది ఏమిటంటే.. తెలుగు ఖుషీని వాస్తవంగా తీసింది తమిళ వెర్షన్ ఆధారంగా అని!
తమిళంలో విజయ్ – జ్యోతికల కాంబినేషన్లో ఎస్జే సూర్య దర్శకత్వంలో 2000 సంవత్సరంలో ఖుషీ విడుదల అయ్యింది. అక్కడ సినిమా హిట్ కావడంతో యథారీతిన రీమేక్ లను చేయడానికి ఇష్టపడే పవన్ కల్యాణ్ ఖుషీ రీమేక్ కూడా చేశాడు. పవన్ కల్యాణ్ తొలి సినిమా తో సహా అన్నీ రీమేక్ లే.
అక్కడమ్మాయి, ఇక్కడబ్బాయి.. ఆమిర్ ఖాన్ హిందీ సినిమా ఖయామత్ సే ఖయామత్ తక్ కు రీమేక్. సుస్వాగతం తమిళంలో విజయ్ చేసిన మరో సినిమాకు రీమేక్. గోకులంలో సీత తమిళం లో కార్తిక్ చేసిన సినిమాకు రీమేక్. హిందీలో ఆమిర్ ఖాన్ నటించిన జోజీతా వహీ సికిందర్ నేపథ్యాన్ని బాక్సింగ్ కు మార్చి యాజిటీజ్ గా కాపీ కొట్టి తమ్ముడు సినిమాను రూపొందించారు. ఖుషీ కూడా రీమేక్. అప్పటి వరకూ పవన్ కల్యాణ్ చేసిన స్ట్రైట్ సినిమాలు రెండే రెండు. ఒకటి తొలి ప్రేమ, రెండు బద్రి. తొలి ఏడు సినిమాల్లో ఐదు రీమేక్ లు. వాటిల్లో ఖుషీ కూడా ఒకటి.
ఖుషీ సినిమా ఒరిజినల్ ను చిత్రీకరించిన ఎస్జే సూర్య తెలుగులో ఆ సినిమాను రీమేక్ చేశాడు. ఈ క్రమంలో డైరెక్షన్ విషయంలో కూడా ఇంప్రొవైజేషన్ చేసి ఉండొచ్చు. అదంతా వేరే కథ. అయితే విజయ్ ఎక్స్ ప్రెషన్లతో పవన్ కల్యాణ్ ఎక్స్ ప్రెషన్లను పోల్చే చర్య మాత్రం పనికిమాలిన పని. మొదట చేసింది విజయ్. దాన్ని పవన్ కల్యాణ్ తన స్టైల్లో చేసి ఉండొచ్చు, లేదా ఇంప్రొవైజ్ చేసి ఉండవచ్చు. అయినా తెలుగునాట పవన్ కల్యాణ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కు తలదన్నే రీతిలో తమిళనాట విజయ్ కు ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటప్పుడు అతడేదో ఆ క్యారెక్టర్ కు ద్రోహం చేసేసినట్టుగా వీరు ఫీల్ అయిపోతున్నారు.
పిల్ల వచ్చి గుడ్డును వెక్కిరించినట్టుగా.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ వెళ్లి ఒరిజినల్ సినిమాను తీసిన హీరోని తమ వెకిలి చేష్టలతో వెక్కిరిస్తున్నారు. రీమేక్ లు చేసుకునే వాళ్లకే ఇంత ఇదైతే.. ఒరిజినల్ ను చేసిన వాళ్లు వీరి చేష్టలను చూసి నవ్వుకోవడం మినహా ఇంకేముంది?