సగటు తెలుగు సినీ ప్రేక్షకుడిని అయితే పొన్నియన్ సెల్వన్ పెద్దగా కదిలించలేకపోయింది. ఈ సినిమా వస్తోందనే హడావుడి తెలుగు థియేటర్ల వద్ద పెద్దగా కనిపించలేదు. ఎగేసుకుని ఈ సినిమాను వీక్షించాలనే ఆసక్తి పెద్దగా కనపడలేదు.
వాస్తవానికి ఈ సినిమాలో భారీ కాస్టింగ్ ఉంది. తమిళ స్టార్లు చాలా మంది నటించారు. అయినప్పటికీ ఇది ఒట్టి మణిరత్నం సినిమాగానే తెలుగునాట ప్రచారాన్ని పొందింది. తెలుగులో మంచి గుర్తింపు ఉన్న కార్తీ, విక్రమ్, త్రిష, ఐశ్వర్యరాయ్ లు కూడా ఈ సినిమాకు తెలుగునాట ప్రేక్షకులను థియేటర్లకు క్యూ కట్టించలేకపోయారు. రొటీన్ గా మణిరత్నం సినిమాలకు ఏ స్థాయి స్పందన ఉంటుందో.. ఈ సినిమా అదే స్థాయిలో నిలిచింది.
అందులోనూ.. ఈ సినిమాకు చారిత్రకనేపథ్యం ఉందనే ప్రచారం.. ఎంతో కొంత మేలే చేసింది. అయినప్పటికీ.. అమితాసక్తి అయితే కనిపించలేదు. ఆ సంగతలా ఉంటే… తమిళనాట మాత్రం ఈ సినిమాకు మంచి కలెక్షన్లే లభించినట్టుగా వార్తలు వస్తున్నాయి. అన్ని భాషల్లోనూ కలిపి ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 80 కోట్ల రూపాయల వసూళ్లను సాధించిందనేది రూపకర్తలు చేసుకుంటున్న ప్రచారం. ఇందులో మెజారిటీ వాటా తమిళనాటే ఉన్నాయట.
జయం రవి, విక్రమ్, కార్తీ రూపంలో ఈ సినిమాకు కనీసం తమిళనాట ఓపెనింగ్స్ ను తీసుకురాగల నటీనటులున్నారు. మణిరత్నం ఇమేజ్, భారీ తనం, తమిళ చారిత్రక నేపథ్యం.. ఇవన్నీ అక్కడ ఈ సినిమాపై ఆసక్తిని పెంచడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. దీంతో తమిళ వెర్షన్ కు మంచి స్థాయిలో ఓపెనింగ్స్ లభించాయి ప్రపంచ వ్యాప్తంగా.
ఇక హిందీ, మలయాళ, కన్నడ, తెలుగు భాషల్లో మాత్రం ఈ సినిమా భారీ ఆదరణను పొందలేకపోయింది. హిందీ వెర్షన్ కు కోటిన్నర రూపాయల మేర తొలి రోజు వసూళ్లు దక్కాయట. మలయాళీ వెర్షన్ కు రెండున్నర కోట్ల రూపాయలు లభించినట్టుగా సమాచారం. స్థూలంగా ఇంటాబయట అన్ని భాషల్లోనూ కలిసి ఈ సినిమాకు 80 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు దక్కాయని అంటున్నారు. మరి వారాంతంలో.. బజ్ ను బట్టి.. ఈ సినిమా ఏ స్థాయి వసూళ్ల మార్కును అందుకుంటుందో!