దర్శకుడు సందీప్ రెడ్డి వంగ పరిస్థితి అస్సలు బాగాలేదు. అర్జున్ రెడ్డి తర్వాత తెలుగులో మరో సినిమా ఓకే చేయించుకోలేకపోయాడు ఈ టాలెంటెడ్ దర్శకుడు. తాజాగా ప్రభాస్ హీరోగా చేయాలనుకున్న సినిమా కూడా అటకెక్కిది. సందీప్ రెడ్డి వంగ స్థానంలో నాగ్ అశ్విన్ వచ్చి చేరాడు. అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది.
నిజానికి ప్రభాస్ హీరోగా తెలుగు-హిందీ-తమిళ భాషల్లో సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ఓ సినిమా ప్లానింగ్ జరిగింది. యూవీ క్రియేషన్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఆ సినిమాను నిర్మించాల్సి ఉంది. కానీ ఎందుకో ఆ ప్రాజెక్టు ఆదిలోనే ఆగిపోయింది. అంతలోనే నాగఅశ్విన్ ప్రాజెక్ట్ ను ప్రకటించాడు ప్రభాస్.
సందీప్ రెడ్డి వంగ ఇలా ఓ సినిమా మిస్ అవ్వడం ఇదే ఫస్ట్ టైమ్ కాదు. ప్రభాస్ కంటే ముందు మహేష్ కూడా ఇదే పనిచేశాడు. అర్జున్ రెడ్డి తర్వాత మహేష్ తో సినిమానే సెట్స్ పైకి వస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఆశ్చర్యకరంగా మహేష్ కూడా సందీప్ రెడ్డికి హ్యాండ్ ఇచ్చాడు. సరిలేరు నీకెవ్వరు చేశాడు. ఇప్పుడు కూడా సందీప్ రెడ్డి సినిమాను పెండింగ్ లోనే పెట్టాడు.
ఇక్కడ పాయింట్ ఏంటంటే.. సందీప్ చెబుతున్న రివల్యూషనరీ స్టోరీలు ప్రభాస్, మహేష్ లాంటి స్టార్స్ కు ఎక్కడం లేదు. అవన్నీ పాథ్ బ్రేకింగ్ కథలు. మరీ ముఖ్యంగా కమర్షియల్ ఎలిమెంట్స్ కు కాస్త దూరంగా ఉన్న కథలు. అందుకే మహేష్ లాంటి హీరోలు రిస్క్ తీసుకోలేకపోతున్నారు. సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకులకు ఇదే ప్రధాన సమస్య అయిపోయింది.