బాహుబలి.. దేశాన్ని షేక్ చేసిన సినిమా. ప్రభాస్-రాజమౌళి కాంబోలో వచ్చిన ఎపిక్ మూవీ. మరి ఈ కాంబినేషన్ మళ్లీ ఎప్పుడు రిపీట్ అవుతుంది. దీనిపై ప్రభాస్ స్పందించాడు. రాజమౌళితో కచ్చితంగా సినిమా ఉంటుందని ప్రకటించిన ప్రభాస్.. ఓ చిన్న స్టోరీ ఐడియాపై తామిద్దరం డిస్కస్ చేసిన విషయాన్ని బయటపెట్టాడు.
“రాజమౌళి ఎప్పుడు మళ్లీ నాతో సినిమా చేస్తాడో తెలీదు కానీ కచ్చితంగా చేస్తాం. మేమిద్దరం ఫ్రెండ్స్. కాబట్టి నేను రాజమౌళిని ప్రత్యేకంగా అడగక్కర్లేదు. నిజానికి మా ఇద్దరికీ ఓ చిన్న ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ఎప్పుడు వర్కవుట్ అవుతుందో తెలీదు. సినిమా మాత్రం ఉంటుంది.”
ఇలా రాజమౌళితో సినిమాపై స్పందించాడు ప్రభాస్. ముంబయిలో జరిగిన రాధేశ్యామ్ ప్రమోషన్ లో మాట్లాడిన ఈ హీరో.. తన లవ్ మేటర్ పై కూడా ఫన్నీగా స్పందించాడు.
“నేను జాతకాలు నమ్మను. విధిని మాత్రం నమ్ముతాను. నా చేయి మాత్రం ఇప్పటివరకు ఎవ్వరికీ చూపించలేదు. ఇక లవ్ మేటర్ విషయానికొస్తే.. ప్రేమ విషయంలో నా అంచనాలు చాలా తప్పాయి. అందుకేనేమో ఇప్పటివరకు నాకు పెళ్లి కాలేదు.”
హిందీ ప్రేక్షకులు తనను యాక్షన్ లుక్ లో చూడ్డానికి మాత్రమే ఇష్టపడతారనే విషయం తనకు తెలుసని.. తనపై వాళ్లకున్న అభిప్రాయాన్ని రాధేశ్యామ్ తో మార్చడానికి ట్రై చేస్తున్నట్టు తెలిపాడు ప్రభాస్. ప్రతి 2 సినిమాలకు ఓ డిఫరెంట్ మూవీ చేయాలని రూల్ పెట్టుకున్నానని.. అలా రాధేశ్యామ్ వచ్చిందన్నాడు. రాధేశ్యామ్ లో కూడా యాక్షన్ ఉందంటున్నాడు ప్రభాస్.