ఒకప్పట్లా ప్రభాస్ వెండితెరపై సరదా సరదాగా కనిపిస్తే ఎలా ఉంటుంది? వరుస పంచ్ లు, జోకులతో హుషారుగా రెచ్చిపోతే ఎలా ఉంటుంది? ఏకంగా లుంగీ కట్టి మాస్ స్టెప్పులు వేస్తే ఎలా ఉంటుంది? ఇవన్నీ మేం చెప్పినవి కాదు. దర్శకుడు మారుతి చెప్పిన మాటలు.
ఆ మాటల్ని నిజం చేస్తూ, ఈరోజు తన కొత్త సినిమా నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాడు మారుతి. లుంగీ కట్టి రంగంలోకి దిగుతున్న ప్రభాస్ లుక్ ఇది.
ఈ మధ్యకాలంలో ప్రభాస్ అన్నీ లార్జర్ దేన్ లైఫ్ పాత్రలే పోషించాడు. బాహుబలి-2, సాహో, రాధేశ్యామ్, సలార్,.. ఇలా ఏ సినిమా తీసుకున్నా అతడి పాత్రలన్నీ చాలా బరువైనవి. సెట్స్ పై ఉన్న కల్కి లో కూడా ప్రభాస్ ది ప్రపంచాన్ని కాపాడే పెద్ద పాత్రే.
ఇలాంటి పాత్రల నడుమ సింపుల్ లుక్ తో, పక్కింటి కుర్రాడు అనిపించే పాత్రతో వస్తున్నాడు ప్రభాస్. అందుకే ఈ లుక్ చాలామందికి నచ్చింది. పైగా ఇది సంక్రాంతి, కోడిపందాల సీజన్. ఈ లుక్ ఆ సీజన్ ను మరింత ఎలివేట్ చేసింది.
అన్నట్టు ఈ సినిమాకు 'ది రాజా సాబ్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాకు రాజా డీలక్స్ అనే పేరు ప్రముఖంగా వినిపించింది. కానీ పాన్ ఇండియా అప్పీల్ కోసం రాజా సాబ్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.
సినిమా షూటింగ్ ఇప్పటికే దాదాపు 40 శాతం పూర్తయింది. కల్కి సినిమా కొలిక్కి వచ్చిన వెంటనే, రాజా సాబ్ అప్ డేట్స్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.