మా సంఘ అధ్యక్షపదవికి పోటీ పడుతున్న ప్రకాష్ రాజ్ ఒక్కసారిగా మీడియా మీద పడ్డారు. మీడియానే మా ఎన్నికలను గోరంతలు కొండంతలు చేస్తోందన్నట్లు కామెంట్లు విసిరారు. అంతే కాదు, అసలు మెగాస్టార్ ను ఇందులోకి ఎందుకు లాగుతున్నారు అంటూ ప్రశ్నించారు. ఇవన్నీ భలే చిత్రంగా వున్నాయి.
అసలు మూడు నెలలు ముందుగా ఎన్నికల బరిలోకి దూకింది ఎవరు?
వెళ్లి ఛానెళ్లలో గంటలకు గంటలు కూర్చున్నది ఎవరు?
మా ఎన్నికల వేడి రగిల్చింది ఎవరు?
మెగాస్టార్ కు చెప్పానని చెప్పింది ఎవరు?
నాగబాబును ఛానెళ్లలో తోడుగా పెట్టుకున్నది ఎవరు?
ఇవన్నీ చేసింది ప్రకాష్ రాజ్ కాదా? ఇప్పుడు తనకేమీ తెలియదన్నట్లు, అమాయకంగా మీడియాను ఆఢిపోసుకోవడం ఏమిటి?
మీడియా అస్సలు ఇన్ వాల్వ్ కాకూడదు అని ప్రకాష్ రాజ్ అనుకుని వుంటే ఛానెళ్లు డిస్కషన్ కు పిలిచినపుడు నో అని చెప్పి వుండొచ్చు కదా? మీడియా ఓవర్ చేస్తోంది అని అనుకున్నపుడు అసలు ప్రెస్ మీట్ పెట్టడం ఎందుకు?
సరే, మెగాస్టార్ చిరంజీవిని ఎందుకు లాగుతున్నారు అని ప్రకాష్ రాజ్ అడుగుతున్నారు. కానీ పోటీ చేస్తున్నవారిలో పలువురు తాము చిరంజీవి మాట మేరకు బరిలో దిగామని తమ తమ సన్నిహితులకు చెబుతుండడం వాస్తవం కాదా?
మోహన్ బాబు స్వయంగా కొంతమందికి ఫోన్ చేస్తే ఇదే విషయం చెప్పారని కూడా తెలుస్తోంది. ఓ సీనియర్ హీరోయిన్ కూడా ఇదే సమాధానం చెప్పారని తెలుస్తోంది.
అంతెందుకు ప్యానల్ లో వున్న ఒక నటుడిని ఈ రిపోర్టర్ నే ఫోన్ చేసి అడిగితే, తనకేమీ తెలియదు అని బాస్ చెప్పారు. పోటీలోకి దిగాను అంతే అని సమాధానం ఇచ్చారు.
మరి పరిస్థితి ఇలా వుంటే చిరంజీవిని లాగుతారేంటీ అని ప్రకాష్ రాజ్ అడగడం ఏమిటి?