బండ్ల గ‌ణేష్‌లో క‌మెడియ‌న్‌ను నిద్ర‌లేపిన ప్ర‌కాశ్‌రాజ్

బండ్ల గ‌ణేష్ అంటే మొద‌ట్లో క‌మెడియ‌న్‌గా సినీ అభిమానుల‌కు ప‌రిచ‌యం. ఆ త‌ర్వాత ఆయ‌న అంచెలంచెలుగా ఎదుగుతూ సినీ నిర్మాత‌గా స్థిర‌ప‌డ్డారు. 2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా కాంగ్రెస్‌లో చేరి హ‌ల్‌చ‌ల్ సృష్టించారు.…

బండ్ల గ‌ణేష్ అంటే మొద‌ట్లో క‌మెడియ‌న్‌గా సినీ అభిమానుల‌కు ప‌రిచ‌యం. ఆ త‌ర్వాత ఆయ‌న అంచెలంచెలుగా ఎదుగుతూ సినీ నిర్మాత‌గా స్థిర‌ప‌డ్డారు. 2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా కాంగ్రెస్‌లో చేరి హ‌ల్‌చ‌ల్ సృష్టించారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ అధికారంలోకి రాక‌పోతే బ్లేడ్‌తో గొంతు కోసుకుంటాన‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసి అంద‌రి దృష్టిని త‌న వైపు తిప్పుకున్నారు. తెలంగాణ‌లో రెండోసారి కాంగ్రెస్ ఓట‌మి చెందింది.

గొంతుకోసుకునే విష‌య‌మై బండ్ల గ‌ణేష్‌ను ప్ర‌శ్నించ‌గా …రాజ‌కీయాల్లో ఎన్నో మాట్లాడుతుంటామ‌ని చెప్పి చ‌ల్ల‌గా త‌ప్పించుకున్నారు. కానీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో వివిధ చాన‌ళ్ల‌కు బండ్ల గ‌ణేష్ ఇచ్చిన ఇంట‌ర్వ్యూలు రాజ‌కీయ తెర‌పై ఓ క‌మెడియ‌న్ క్యారెక్ట‌ర్‌ను త‌ల‌పించాయనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి.

ఇటీవ‌ల గ్రేట‌ర్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ముద్దుబిడ్డ‌, ఎమ్మెల్సీ క‌విత మాట్లాడుతూ …గ‌త ఎన్నిక‌ల్లో బండ్ల గ‌ణేష్ కామెడీ ఉండింద‌ని, ఈ ఎన్నిక‌ల్లో బండి సంజ‌య్ ఆ లోటు భ‌ర్తీ చేస్తున్నార‌ని వ్యంగ్యంగా అన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్‌రాజ్‌పై బండ్ల గ‌ణేష్ తాజాగా వ‌రుస ట్వీట్స్ చేశారు. 

ప‌వ‌న్‌ను ఊస‌ర‌వెల్లి అన‌డ‌మే బండ్ల గ‌ణేష్ ఆగ్ర‌హానికి కార‌ణం. తాను రాజ‌కీయాల‌కు దూర‌మంటూనే ప్ర‌కాశ్‌పై రాజ‌కీయ విమ‌ర్శ‌లు చేశారు. అలాగే ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై త‌న అపార భ‌క్తిని చాటుకున్నారు. త‌న దేవుడు ప‌వ‌న్‌ను ఏమైనా అంటే అస్స‌లు స‌హించేది లేద‌ని బండ్ల హెచ్చ‌రించ‌డం గ‌మ‌నార్హం.

''ఎలక్షన్ టైం లో రాజకీయాలు మాట్లాడకూడదని నేనేం మాట్లాడలేదు నేను ఒకటి మాత్రం చెప్తున్నా..నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. రాజకీయాలతో సంబంధం లేదు. కానీ పవన్ కళ్యాణ్ అంటే నాకు ఇష్టం. ఆయన వ్యక్తిత్వం, ఆయన నిజాయితీ, ఆయన నిబద్ధత నాకు తెలుసు. పవన్ కళ్యాణ్ మహోన్నతమైన వ్యక్తి . రాజకీయాలు ఎవరైనా మాట్లాడుకోవచ్చు, చేయొచ్చు. కానీ వ్యక్తిత్వం గురించి, పవన్ కళ్యాణ్ గురించి ఎవరు మాట్లాడినా నేను సహించను.

నా దృష్టిలో  పవన్ కల్యాణ్  ఎప్పటికీ దైవంతో సమానం. ఈ రోజు తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది దర్శకులు, ఎంతో మంది సాంకేతిక నిపుణులు ఎంతోమంది నిర్మాతల్ని పరిచయం చేసిన ఘనత మా దైవం పవన్ కళ్యాణ్‌ది. నిజాయితీకి నిలువుటద్దం పవన్. నాకు కృతజ్ఞత అనేది నా రక్తంలో ఉంది. నేను ఈరోజు అనుభవిస్తున్న ఈ స్థాయి నాకు పవన్  పెట్టిన భిక్ష'' అని బండ్ల గణేష్‌ వరుస ట్వీట్స్‌లో తెలిపారు.

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఒక రాజ‌కీయ పార్టీ అధినేత‌. ఆయ‌న రాజ‌కీయ పంథాపై ర‌క‌ర‌కాల విమ‌ర్శ‌లు వ‌స్తుంటాయి. ఆ విమ‌ర్శ‌ల‌ను స‌హించేది లేద‌ని బండ్ల గ‌ణేష్ హెచ్చ‌రించ‌డం అంటే కామెడీ కాక మ‌రేంటి? బ‌ండ్ల గ‌ణేష్‌లోని క‌మెడియ‌న్ మ‌ళ్లీ నిద్ర‌లేచిన‌ట్టున్నారు. ఆయ‌న‌లోని కామెడీ యాక్ట‌ర్‌ను మ‌ళ్లీ వెలుగులోకి తెచ్చిన ఘ‌న‌త ప్ర‌కాశ్‌రాజ్‌కు ద‌క్కుతుంది. 

ఎన్నిక‌ల స‌మ‌యంలోనే రాజ‌కీయాలే మాట్లాడుతారు. మిగిలిన సంద‌ర్భాల్లో ఎవ‌రైనా అభివృద్ధి గురించి మాట్లాడ్తారు. కానీ మ‌నోడు బండ్ల గ‌ణేష్ మాత్రం అంతా రివ‌ర్స్ వ్య‌వ‌హారం ఉన్న‌ట్టుంది. ఎన్నిక‌ల స‌మ‌యంలో రాజ‌కీయాలు మాట్లాడ్డం ధ‌ర్మం కాద‌ని మాట్లాడ‌లేద‌ని చెబుతున్నారు. ఇదేం ఫిలాస‌ఫీనో అస్స‌లు అర్థం కాదు. అవున్లే ఆయ‌న ప‌వ‌న్‌క‌ల్యాణ్ భ‌క్తుడు క‌దా. అర్థ‌మైతేనే ఆశ్చ‌ర్యపోవాలి గానీ, కాక‌పోతే ఎందుకు?

పేపర్లు విసిరేసిన తమ్మినేని