ప్రస్తుతం భారతదేశంలో ఒక్కో సినిమాకూ అత్యంత ఎక్కువ పారితోషికం అందుకుంటున్న నటుడు ఎవరంటే.. ప్రభాస్ అని అంటోంది బాలీవుడ్ మీడియా! బాలీవుడ్ లో 90లలో క్లాసిక్ హిట్స్ ను ఇచ్చిన వారు ఇంకా స్టార్లుగా వెలుగొందుతున్న తరుణంలో, వారి తో పాటు 80లలో సూపర్ హిట్లు కొట్టిన వాళ్లు ఇప్పుడు సూపర్ స్టార్లుగా ఇంకా ఫీల్డ్ లో ఉన్న తరుణంలో కూడా… ప్రభాస్ దేశంలోనే అత్యంత ఎక్కువ రెమ్యూనిరేషన్ పొందుతున్న నటుడుగా నిలుస్తూ ఉన్నాడు.
ఇలా ఉన్న ప్రభాస్ మానియా గురించి బాలీవుడ్ మీడియా రకరకాల విశ్లేషణలు చేస్తూ ఉంది. నూటా యాభై కోట్ల రూపాయలతో ప్రభాస్ నంబర్ వన్ గా నిలుస్తున్నాడు.
సౌత్ స్టార్లు గా వెలిగినప్పటికీ.. కమల్ హాసన్, చిరంజీవి, రజనీకాంత్ లు బాలీవుడ్ పై ఆధిపత్యం చలాయించలేకపోయారు. వీరిలో రజనీకాంతే కాస్త సీరియస్ గా హిందీలో సినిమాలు చేశాడు. కమల్ తన తమిళ సినిమాల అనువాదానికి బాలీవుడ్ లో స్టడీగా మార్కెట్ ను కొనసాగించగలిగాడు. చిరంజీవి మాత్రం రెండు మూడు ప్రయత్నాలు చేసి.. చాలించుకున్నారు. ఇక ఈ తరంలో సౌత్ స్టార్లలో రామ్ చరణ్ డైరెక్టు బాలీవుడ్ సినిమా చేసి డిజాస్టర్ ను మిగుల్చుకున్నాడు.
అజిత్, విజయ్ లాంటి వాళ్లు కానీ, మహేశ్ బాబు కానీ.. బాలీవుడ్ ను మెస్మరైజ్ చేయడంలో సక్సెస్ కాలేకపోయారు. మిగతా వాళ్లు.. బాలీవుడ్ పోటీ వైపే చూడలేదు. మరి ఇలాంటి వారందరికీ సాధ్యం కానిది ప్రభాస్ కే సాధ్యం అవుతున్నట్టుగా ఉంది. నాన్ హిందీ బెల్ట్ నుంచి వెళ్లే వాళ్లకు బాలీవుడ్ మీడియా ఇంత పుషప్ ఇస్తుందని కూడా ఎవ్వరూ ఊహించి ఉండరు. ప్రభాస్ గురించి హిందీ మీడియా అనునిత్యం క్రేజీ ఆర్టికల్స్ తో వస్తోంది.
ఇప్పుడు దేశంలో అత్యధిక రెమ్యూనిరేషన్ పొందుతున్న హీరో అంటూ కూడా ప్రభాస్ గురించి విశేష కథనాలను ఇస్తోంది అక్కడి మీడియా. నాన్ హిందీ బెల్ట్ నుంచి వెళ్లి హిందీలో సూపర్ స్టార్ అయిన వారిలో బహుశా చివరి హీరో మిథున్ చక్రబర్తి కాబోలు. ఈ బెంగాలీ తర్వాత.. ప్రభాస్ అనే తెలుగు వాడు హిందీ జనాలు, హిందీ మీడియా ఓన్ చేసుకుంటున్న స్టార్ హీరో ఇమేజ్ ను సంపాదించుకుంటున్నట్టుగా ఉన్నాడు!