సంతోష్ శోభన్ హీరోగా నటించిన సినిమా ప్రేమ్ కుమార్. ఈ సినిమాకు సంబంధించి ఈమధ్య ఓ వీడియో విడుదల చేశారు. “సుయోధనా ఈ ప్రేమ్ కుమార్ గాడి కథ ఏమి” అంటూ రిలీజ్ చేసిన ఈ వీడియోకు నటుడు ప్రియదర్శి వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఏమాత్రం అర్థంకాకుండా పూర్తిస్థాయిలో కన్ఫ్యూజ్ చేస్తూ విడుదల చేసిన వీడియో అది.
మేకర్స్ ఎత్తుగడ ఫలించింది. ప్రేమ్ కుమార్ ట్రయిలర్ కోసం అంతా ఎదురుచూసేలా చేసింది. దీనికితోడు పీకే ఎక్కడ అంటూ చేసిన ప్రచారం కూడా ఆకట్టుకుంది. అలా కొంతమంది దృష్టిని ఆకర్షిస్తూ కొద్దిసేపటి కిందట విడుదలైంది ప్రేమ్ కుమార్ ట్రయిలర్.
ఈసారి మాత్రం ఎలాంటి గందరగోళం సృష్టించలేదు. క్లియర్ గా సినిమా స్టోరీ ఏంటి, జానర్ ఏంటనే విషయాన్ని బయటపెట్టారు. సినిమాలో హీరో పేరు ప్రేమ్ కుమార్. ఎన్నిసార్లు పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించినా ఆ పెళ్లి ఆగిపోతుంది. ఈ విషయంలో హీరోకి ఓ పెద్ద ట్రాక్ రికార్డ్ ఉంటుంది.
అలాంటి హీరో పెళ్లిళ్లు చెడగొట్టే డిటెక్టివ్ గా మారతాడు. సరిగ్గా అప్పుడే ఓ హీరో, హీరోయిన్ అతడి జీవితంలోకి ఎంటర్ అవుతారు. ఆ తర్వాత ప్రేమ్ కుమార్ జీవితం ఎలా మారిందనేది ఈ సినిమా కథ. మూవీ మొత్తం హిలేరియస్ గా ఉండబోతోందనే విషయం ట్రయిలర్ చూస్తే అర్థమౌతోంది.
ట్రయిలర్ లో సంతోష్ శోభన్ కామెడీ టైమింగ్ బాగుంది. హీరో మేనేజర్ పాత్రలో సుదర్శన్ మంచి కామెడీ పండించాడు. అభిషేక్ మహర్షి డైరక్ట్ చేసిన ఈ సినిమాను వచ్చేనెల 18న రిలీజ్ చేయబోతున్నారు. అంటే, విడుదలకు ఏకంగా నెల రోజుల ముందే ట్రయిలర్ రిలీజ్ చేశారన్నమాట.