దర్శకుడు ఇంద్రగంటి చాలా వైవిధ్యంగా ఆలోచిస్తుంటారు. అందులో కూడా కాస్త ఫన్ వుండేలా చూసుకుంటారు. ఆయన రూపొందిస్తున్న లేటెస్ట్ సినిమా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. ఈ సినిమా కోసం ఓ గమ్మత్తయిన పాటను ప్లాన్ చేసారు.
ఓ సినిమా దర్శకుడిని జర్నలిస్ట్ లు పలు ప్రశ్నలు అడుగుతారు. ఆ ప్రశ్నలు, ఈ సమాధానాలే పాట. గతంలో మెగాస్టార్ సినిమాలో దర్శకుడు బాలచందర్ ఇలాంటి ప్రయోగం చేసారు. ప్రశ్నలు సమాధానలకు లయవిన్యాసం జోడించి పాటగా మార్చారు.
ఇప్పుడు ఇంద్రగంటి కూడా జర్నలిస్ట్ లు అడిగే ప్రశ్నలు, దర్శకుడు చెప్పే సమాధానాలు కలిపి పాటగా మార్చేసారు. విషయం ఏమిటంటే ఈ సినిమాలో హీరో సుధీర్ బాబు సినిమా దర్శకుడిగా కనిపిస్తారు. జర్నలిస్ట్ లు ప్రెస్ మీట్ లో ‘అందంగా వున్నారు మీరే హీరోగా చేయచ్చు కదా అని అడగడం, దానికి సుధీర్ బాబు, మనకెందుకు అండీ, మన దగ్గర చాలా మంది మంచి హీరోలు వున్నారు కదా అనడం…ఇలా అంతా ఓ పాటలా సాగుతుందన్నమాట.
గతంలో సమ్మోహనం సినిమాను ఇంద్రగంటి రూపొందించారు. ఒక విధంగా ఇది సమ్మోహనం 2 అనుకోవచ్చు. అక్కడ హీరో కి సినిమాలంటే పెద్దగా ఆసక్తి వుండదు. సినిమా హీరోయిన్ తో ప్రేమలో పడతారు. ఇక్కడ హీరోయిన్ కు సినిమాలు అంటే ఆసక్తి వుండదు. సినిమా దర్శకుడితో ప్రేమలో పడుతుంది. మహేంద్ర, కిరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీస్ సంస్థ సమర్పిస్తోంది.