తమిళ హీరో శింబు మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఇప్పటికే బోలెడన్ని వివాదాల్లో శింబు పేరు నలుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా అతడి తీరుపై తమిళ ప్రముఖ నిర్మాత జ్ఞానవేల్ రాజా అక్కడి నిర్మాతల మండలికి ఫిర్యాదు చేయడం గమనార్హం. శింబును హీరోగా పెట్టి ఒక సినిమాను రూపొందిస్తున్నాడు ఆ నిర్మాత. అయితే శింబు సహకరించడం లేదని, సమయానికి షూటింగులకు రావడం లేదని జ్ఞానవేల్ రాజా ఫిర్యాదు చేశాడు. దీంతో తనకు భారీ నష్టం వచ్చిందని కూడా పేర్కొన్నాడు.
శింబు వేళకు షూటింగులకు వచ్చేవాడు కాదని, ఎప్పుడు బడితే అప్పుడు వచ్చేవాడని.. దీంతో కాంబినేషన్లో సీన్లను చిత్రీకరించడం బాగా కష్టమైందని ఆ నిర్మాత పేర్కొన్నాడు. మిగతా నటీనటులు కూడా శింబు రాకపోవడంతో ఇబ్బంది పడ్డారని, వారు సినిమా కోసం ఎక్కువ రోజులు పని చేయాల్సివస్తోందని.. శింబూతో కాంబినేషన్ల కోసం వారు అదనపు కాల్షీట్లను కేటాయించాల్సి వస్తోందని నిర్మాత వాపోయాడు.
దీంతో వారికి సహజంగానే అదనంగా డబ్బు ఇవ్వాల్సి వస్తోందని పేర్కొన్నాడు. ఏతావాతా సకాలంలో షూటింగులకు రాక శింబు తనకు భారీ నష్టాన్ని తెస్తున్నాడని ఆ నిర్మాత మండలిలో ఫిర్యాదు చేశాడు. మరి ఇది వరకూ ఎవరైనా క్యారెక్టర్ ఆర్టిస్టులు, కమేడియన్లు ఇలా నిర్మాతలను ఇబ్బంది పెట్టిన ఫిర్యాదులు ఉన్నాయి. తను హీరోగా నటిస్తున్న సినిమాకే ఇలాంటి ఝలక్ ఇస్తున్న హీరోగా శింబు నిలుస్తూ ఉన్నాడు!