తన మరణానంతరం కళ్లను డొనేట్ చేసిన కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఆకాంక్ష నెరవేరింది. తన తండ్రి స్ఫూర్తితో మరణానంతరం కళ్లను దానానికి పునీత్ ముందుకొచ్చాడు. పునీత్ మరణం చిన్న వయసులోనే, హఠాత్తుగా సంభవించినా.. తీవ్ర విషాదంలో ఉన్నప్పటికీ కుటుంబీకులు కళ్ల దానానికి సహకారించారు. పునీత్ ఆకాంక్షను నెరవేర్చారు. బెంగళూరులోని నారాయణ నేత్రాలయ వారు పునీత్ మృతదేహం నుంచి కళ్లను సేకరించింది.
పునీత్ మంచి మనసు గురించి ప్రపంచ కీర్తిస్తూ ఉండగా… ఆయనను మరో మెట్టెక్కించింది నేత్రదానం. పునీత్ మరణించిన తర్వాత 48 గంటల వ్యవధిలోపే.. ఆయన కళ్లు నలుగురు అంధులకు చూపునిచ్చాయని నారాయణ నేత్రాలయ ప్రకటించింది. ఇది అరుదైన ఘటన అని కూడా పేర్కొంది.
పునీత్ నుంచి కళ్లను సేకరించిన తర్వాత.. ఆయన కార్నియాలను నలుగురు అంధులకు అమర్చినట్టుగా వైద్యులు తెలిపారు. ఒక్కో కార్నియాను రెండు భాగాలుగా చేసి అవసరమైన వాళ్లకు చూపును తిరిగిచ్చారు వైద్యులు.
ఒక వ్యక్తి చేసిన నేత్రదానంతో నలుగురికి చూపు రావడం అనేది అరుదైన ఘటన అని కూడా వైద్యులు తెలిపారు. పునీత్ నేత్రదానంతో అది జరిగింది. ఎవరైనా నేత్రదానం చేసినా.. వాటి అవసరం కలిగిన వారిని గుర్తించడం కూడా అంత తేలికైన పని కాదని వైద్యులు చెబుతున్నారు. కండీషన్ కచ్చితంగా సెట్ అయిన వారికే వీటిని అమర్చే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో పునీత్ జన్మ సార్థకం అయ్యింది.
తను మరణించినా.. ఆయన కళ్లు మరో నలుగురికి చూపును ప్రసాదించాయి.పునీత్ సేవానిరతి గురించి అంతా స్మరిస్తున్న వేళ నేత్రదానం సఫలం అయిన తీరు.. ఆయనను మనిషిగా మరింత ఉన్నత స్థాయిలో నిలుపుతోంది.