రాజమౌళి ఒప్పుకుంటారా?

రాజమౌళి సినిమా అంటే నిర్మాత జస్ట్ క్యాషియర్ మాత్రమే అన్నది ఇండస్ట్రీ టాక్. బ్యాంక్ లో డబ్బులు వుండాలి. చెక్ బుక్ మీద సంతకాలు వుండాలి. మిగిలినదంతా ప్రొడక్షన్ నుంచి మార్కెటింగ్ వరకు అంతా…

రాజమౌళి సినిమా అంటే నిర్మాత జస్ట్ క్యాషియర్ మాత్రమే అన్నది ఇండస్ట్రీ టాక్. బ్యాంక్ లో డబ్బులు వుండాలి. చెక్ బుక్ మీద సంతకాలు వుండాలి. మిగిలినదంతా ప్రొడక్షన్ నుంచి మార్కెటింగ్ వరకు అంతా రాజమౌళి అండ్ ఫ్యామిలీనే చూసుకుంటారు.

ఓ నిబద్దత, విలువులు వున్న దర్శకుడు కనుక ఏనాడో జమానా కాలం నాడు ఇచ్చిన అడ్వాన్స్‌ను, వెనక్కు ఇచ్చి చేతులు దులిపేసుకోకుండా, మాటకు కట్టుబడి డివివి దానయ్యకు సినిమా చేసారు. ఇప్పుడు మరో సినిమా కెఎల్ నారాయణకు చేస్తున్నారు. అయితే ఇప్పుడు కేఎల్ నారాయణతో చేయబోయే సినిమాలో భాగస్వామ్యం కోసం టాలీవుడ్ కింగ్ పిన్ దిల్ రాజు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని టాలీవుడ్ లో గట్టిగా గ్యాసిప్‌లు వినిపిస్తున్నాయి.

ఇలాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లో భాగస్వామ్యం దొరికితే దిల్ రాజు పంట పండినట్లే. ఇటు భాగస్వామ్యం వస్తుంది అటు నైజాం, వైజాగ్ ఏరియాల హక్కులు కూడా తనకే దొరుతాయి. అందువల్ల ఈ ప్రాజెక్ట్ లో భాగస్వామ్యం కోరుకోవడం తప్పు కాదు, అత్యాశ కూడా కాదు. పైగా ఓ బిజినెస్ మాన్ చేయాల్సిన, ప్రయత్నించాల్సిన పనే అది.

కానీ రాజమౌళి అంగీకరిస్తారా? అన్నదే అనుమానం. మహేష్ వైపు నుంచి అభ్యంతరం వుండొచ్చు. వుండకపోవచ్చు. అది పెద్ద విషయం కాదు. కానీ రాజమౌళి ఆలోచనలు వేరుగా వుంటాయి.

విశ్వసనీయ వర్గాల భోగట్టా ప్రకారం మహేష్-కెఎల్ నారాయణ సినిమాలో ఒక ఇంటర్నేషనల్ స్టూడియో భాగస్వామ్యం కోసం రాజమౌళి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. హాలీవుడ్ స్టూడియోలు సినిమాకు అవుట్ అండ్ అవుట్ టెక్నికల్ ఇంకా ప్రొడక్షన్ సపోర్ట్ అందించడం ద్వారా భాగస్వామ్యం తీసుకుంటాయి. అలాంటి దాని కోసం రాజమౌళి ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.

అందువల్ల ఈ ప్రాజెక్టులో నిర్మాతగా కెఎల్ నారాయణ పాత్రనే అంతంత మాత్రంగా వుండే అవకాశం వుంది. ఆర్ఆర్ఆర్ విషయంలో నిర్మాత దానయ్య పాత్ర ఏమేరకు వుందో చూడనే చూసారు.. ముఖ్యంగా ఆస్కార్ అవార్డులకు ముందు వెనుక. అందువల్ల ఇక్కడ కూడా అలాగే వుంటుంది. ఇక అలాంటపుడు దిల్ రాజు ను రాజమౌళి ప్రాజెక్ట్ లోకి ఎంటర్ కానిస్తారా? అన్నది వేచి చూడాలి.