హీరోయిన్ లావణ్య త్రిపాఠీ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా “హ్యాపీ బర్త్ డే”. ఈ చిత్రాన్ని మత్తువదలరా సినిమాను అందించిన దర్శకుడు రితేష్ రానా రూపొందిస్తున్నారు. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ, మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి నిర్మిస్తోంది. ఈ చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమం దర్శకుడు రాజమౌళి చేతుల మీదుగా హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా
దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ…మైత్రీ మూవీ మేకర్స్ అంటే మంచి ప్రాజెక్ట్స్ వెతికి పట్టుకుంటూ బంగారం తవ్వుకునే సంస్థ. హ్యాపీ బర్త్ డే కూడా ఆ సంస్థకు మరో పెద్ద విజయాన్ని అందించాలని కోరుకుంటున్నా. ట్రైలర్ బ్లాక్ బస్టర్ గా ఉంది. లావణ్య క్యారెక్టర్ బాగుంది. హీరోయన్స్ కు కథను ముందుండి నడిపే ఇలాంటి పాత్రలు దొరకడం అరుదు. ఆమె బాగా నటించిందని అర్థమవుతుంది.
ఇప్పుడున్న కమెడియన్స్ లో నాకు వెన్నెల కిషోర్, సత్య అంటే ఇష్టం. కామెడీ, థ్రిల్లర్ కలిపి చేయడం కష్టం. ఒకటి ఎక్కువైతే ఇంకొటి తగ్గిపోతుంది. రితేష్ వాటిని బాగా కంబైన్ చేసి ఉంటాడని తెలుస్తోంది. ఈ మధ్య ప్రేక్షకులు థియేటర్స్ కు రావడం లేదు అంటున్నారు కానీ నా అభిప్రాయం ప్రకారం మనసు పెట్టి కష్టపడి చేసిన ఏ సినిమానూ ప్రేక్షకులు వదులుకోరు. అలా కష్టపడాలని సూచిస్తున్నా. హ్యాపీ బర్త్ డేలో ఆ ప్రయత్నం జరిగిందని ఆశిస్తున్నా. అన్నారు.
దర్శకుడు రితేష్ రానా మాట్లాడుతూ…నా మొదటి చిత్రం టీమ్ తోనే మళ్లీ పనిచేశాను. దాని కంటే ఈ సినిమాలో డబుల్ ఫన్, డబుల్ యాక్షన్, డబుల్ థ్రిల్ ఉంటుంది. థియేటర్ లో హ్యాపీ బర్త్ డే సినిమా చూసి ఎంజాయ్ చేయండి. అన్నారు.
హీరోయిన్ లావణ్య త్రిపాఠీ మాట్లాడుతూ… మాదొక డిఫరెంట్ ఫిల్మ్ అని మేము చెప్పక్కర్లేదు. మీరు టీజర్, ట్రైలర్ చూస్తే తెలిసిపోతుంది. నిర్మాత కొత్తగా ఆలోచిస్తేనే ఇలాంటి మూవీ తెరపైకి వస్తుంది. దర్శకుడిగా రితేష్ రానా ఇప్పటికే నిరూపించుకున్నాడు. నేను ఈ తరహా సినిమాలో నటిస్తానని అనుకోలేదు. నా క్యారెక్టర్ కంప్లీట్ గా కొత్తగా ఉంటుంది. జూలై 8న థియేటర్ లో పార్టీ చేసుకుందాం. అన్నారు.
నిర్మాత చెర్రి మాట్లాడుతూ… హ్యాపీ బర్త్ డే సినిమా నుంచి ఇప్పటిదాకా విడుదల చేసిన టీజర్, ట్రైలర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటే ఇదొక కొత్త తరహా సినిమా అని మీకు అర్థమై ఉంటుంది. ఇదొక సర్రియల్ యాక్షన్ కామెడీ ఫిల్మ్. ఫిక్షనల్ నేపథ్యంతో కథ సాగుతుంది. ఒక్కో ఛాప్టర్ ద్వారా ఒక్కో పాత్రను పరిచయం చేస్తూ వెళ్లారు దర్శకుడు. చివరలో ఆ పాత్రలన్నీ ఎలా కలుస్తాయి అనేది ఆసక్తికరంగా ఉంటుంది. జూలై 8న మా సినిమాను థియేటర్ లో చూడండి, మీ రెస్పాన్స్ కోసం వేచి చూస్తుంటాం. అన్నారు.