గత కొంత కాలంగా వినిపిస్తున్న వార్తలు నిజమయ్యాయి. సంగీత సరస్వతి అనదగ్గ సంగీత దర్శకుడు ఇళయరాజాను రాజ్యసభకు ఎంపిక చేసారు. లలిత కళలు, సాంకేతిక విద్యారంగాలకు చెందిన వారిని రాజ్యసభకు నామినేట్ చేసే అధికారం రాష్ట్రపతికి వుంది.
ఆ కోటాలోనే ఇళయరాజాను రాజ్యసభకు నామినేట్ చేసారు. ఇళయరాజా ఇటీవల 'అంబేద్కర్ – మోదీ' పుస్తకానికి ముందుమాటలో ప్రధాని మోదీ.. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాలను నెరవేరుస్తున్నారని పేర్కొన్నారు. అప్పటి నుంచి ఇళయరాజా రాజ్యసభకు వెళ్తారన్న వార్తలు ప్రారంభమయ్యాయి. చివరకు అవే నిజమయ్యాయి.
ఇదిలా వుంటే ఇళయరాజా తో పాటు అథ్లెట్ పిటి ఉష ను, బాహుబలి కథకుడు విజయేంద్ర ప్రసాద్ ను రాజ్యసభకు ఎంపిక చేసారు. పిటి ఉష ఎంపిక ఆశ్చర్యం కాదు. ఎందుకంటే ఆమె ప్రతిభ కల అథ్లెట్. కానీ విజయేంద్ర ప్రసాద్ ఓ సినిమా కథకుడు మాత్రమే.
జస్ట్ కొన్ని కమర్షియల్ సినిమాల కథకుడు. వాటిల్లో కూడా ఆయన ఒక్కడి ఆలోచనల కన్నా, కొడుకు రాజమౌళి పాత్ర ఎక్కువ. పైగా ఆయన కథల్లో చాలా వరకు వేరే సినిమాల నుంచి ఏరినవి కూడా వున్నాయని విమర్శలు వున్నాయి. అలాంటి ఓ కమర్షియల్ కథకుడికి ఎంపీ ఇవ్వడం చిత్రమే.