తను నటించిన రక్షణ అనే సినిమా వెనక బండారాన్ని పాయల్ రాజ్ పుత్ బయటపెట్టిన సంగతి తెలిసిందే. నాలుగేళ్ల కిందట చేసిన ఆ సినిమాకు పేరు మార్చి రిలీజ్ చేస్తున్నారని, తనకు బకాయి పడ్డ డబ్బును ఇవ్వకుండా ప్రచారానికి రమ్మని బలవంతం చేస్తున్నారని, అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని సోషల్ మీడియాలో ఆరోపించిన సంగతి తెలిసిందే. తనకు ఒక్క మాట కూడా చెప్పకుండా, తన కాల్షీట్లతో సంబంధం లేకుండా ప్రచారానికి రమ్మని డిమాండ్ చేస్తున్నారంటూ ఆరోపించింది.
పాయల్ ఆరోపించిన గంటల వ్యవధిలోనే ప్రతిస్పందన వచ్చింది. అయితే నేరుగా నిర్మాత ఈ కౌంటర్ ఇవ్వలేదు. నిర్మాత ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ స్పందించింది. పాయల్ పై రక్షణ సినిమా నిర్మాత ప్రణదీప్ ఠాకూర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మండలి స్పందించింది.
ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ చెప్పిన ప్రకారం.. ఈ సినిమా కోసం పాయల్ 50 కాల్షీట్లు కేటాయించిందట. వీటిలో 47 కాల్షీట్లను దర్శకనిర్మాత ఠాకూర్ వాడుకున్నాడట. మిగిలిన 3 కాల్షీట్లను ప్రమోషన్ కోసం దాచుకున్నాడట. ఇప్పుడా 3 కాల్షీట్లు ఇవ్వమంటే పాయల్ మొండికేస్తుందనేది ప్రణదీప్ ఆరోపణ.
అంతేకాదు, పాయల్ చెప్పినట్టు పెండింగ్ ఎమౌంట్ ఇవ్వడానికి కూడా నిర్మాత అంగీకరించాడు. పాయల్ కు తను 6 లక్షల రూపాయలు బాకీ ఉన్నానని, అయితే ఆమె ప్రచారానికి వచ్చిన తర్వాత, సినిమా విడుదలకు ముందు ఆ మొత్తాన్ని అందిస్తానని చెప్పి, ఆ మేరకు చెక్ ను నిర్మాతల మండలికి సమర్పించాడు.
అగ్రిమెంట్ ప్రకారం, అన్ని ఫార్మాట్ల ప్రమోషన్లకు పాయల్ హాజరుకావాల్సి ఉంటుందని, ఒకవేళ అలా హాజరుకాకపోతే, సినిమాకు వచ్చిన నష్టాల్ని పాయల్ భరించాల్సి వస్తుందని నిర్మాత హెచ్చరించాడు.
నిర్మాత ఫిర్యాదు/వివరణ మేరకు ఈ వివాదాన్ని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు బదిలీ చేసింది నిర్మాతల మండలి. అయితే పాయల్ రాజ్ ఫుల్ కు మా అసోసియేషన్ లో సభ్యత్వం లేదంట. కాబట్టి అది తమ పరిథిలోకి రాదని అసోసియేషన్ తేల్చి చెప్పింది. దీంతో ఈ మేటర్ ముంబయి ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు బదిలీ అయింది. రాబోయే రోజుల్లో ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.