సినిమా వాళ్ల పార్టీలు అంటే.. అవెంత కలర్ ఫుల్ గా ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. గత కొన్నేళ్లలో టాలీవుడ్ లో కూడా ఆ పార్టీ కల్చర్ బాగా పెరిగిపోయింది. సినిమా వాళ్ల నైట్ లైఫ్, అకేషనల్ గా వారు చేసుకునే పార్టీల గురించి సినీ ప్రేక్షకుల్లో కూడా రకరకాల చర్చలున్నాయి. అలాంటి పార్టీలకు జాయింటుగా హాజరయ్యే వాళ్లంతా క్లోజ్ గా ఉంటారనేది బహిరంగ సత్యమే.
ఆ పేజ్ త్రీ పార్టీలకు కామన్ గా హాజరయ్యే వాళ్ల జీవితాలే వేరుగా ఉంటాయని, వారి జీవితాలను ఆ పార్టీలే మార్చేస్తాయని కూడా అనుకుంటూ ఉంటారు. అలా పార్టీలకు హాజరయ్యే వాళ్లకు అవకాశాలు కూడా ఇబ్బడిముబ్బడిగా వస్తాయనే విశ్లేషణలు ఉన్నాయి.
పార్టీలకు హాజరైతే నలుగురి దృష్టిలో పడటం జరుగుతుంది, అప్పుడు ఆటోమెటిక్ గా పరిచయాలు పెరుగుతాయి..దీంతో అవకాశాలు దక్కవచ్చు అనేది ఒక విశ్లేషణ. అలాగే పార్టీలను ద్వంద్వార్థంగా చూసే వాళ్లూ లేకపోలేదు.
పార్టీలకు బాగా హాజరయ్యే హీరోయిన్లకు ఎక్కువ సినిమాల్లో ఛాన్సులు దక్కుతాయనేది మరో మాట. ఇది ఎనభైల నుంచి ఉన్నదే! అయితే అలాంటిదేమీ లేదంటోంది రకుల్ ప్రీత్ సింగ్. పార్టీలకు హాజరైనంత మాత్రానా హీరోయిన్లకు ఎక్కువ అవకాశాలు దక్కుతాయనేది అపోహ మాత్రమే అంటోంది రకుల్. బోలెడన్ని బాలీవుడ్ పార్టీలకు హాజరవుతూ ఉండే ఈ హీరోయిన్ పార్టీలు అవకాశాలు తెచ్చిపెట్టవని అనుభవసారంతో చెబుతున్నట్టు ఉందని పరిశీలకులు అంటున్నారు!