‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ సినిమాలో తాను ఏ కులాన్ని తక్కువ చేయలేదని దర్శక, నిర్మాత రాంగోపాల్ వర్మ తెలిపారు. రూల్ ప్రకారం చూస్తే .. ఏ సినిమా రిలీజ్ కాదని, కానీ, అన్ని రూల్స్‌ను తన సినిమా మీదే ప్రయోగించారని ఆయన వాపోయారు.
సెటైర్ కోసమే ఈ సినిమా చేశానని, ఏ పార్టీ కోసమో, వ్యక్తి కోసమో సినిమా తీయలేదని వర్మ తెలిపారు. తనను ఎంత గట్టిగా ఆపితే అంత గట్టిగా లేస్తానని, అందుకే ఈ సినిమాకు సీక్వెల్ కూడా తీస్తున్నానని వర్మ ప్రకటించారు.
సెన్సార్ అనేది కాలం చెల్లిన వ్యవస్థగా మారిందని, దాన్ని గురించి మాట్లాడనని తెలిపారు. ‘ఓటు వేసి మనకు కావలసిన నాయకులను ఎన్నుకునే జ్ఞానం ఉన్న మనకు ఏ సినిమాను చూడాలి.. దేనిని చూడకూడదనేది తెలియదా? అది ఇద్దరు, ముగ్గురు సెన్సార్ వాళ్ళు చూసి చెప్పాలా?’ అంటూ వర్మ చిర్రుబుర్రులాడారు.