హీరోయిన్లపై విమర్శలు చేసే క్రమంలో షేమింగ్ మొదలైందని అంటోంది ఒకప్పటి స్టార్ హీరోయిన్ రవీనా టాండన్. ఈ విషయంలో చాలామంది బాలీవుడ్ ను బద్నామ్ చేస్తుంటారని, నిజానికి బాడీ షేమింగ్ కు బాలీవుడ్ కు సంబంధం లేదని అంటోంది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది రవీనా.
కెరీర్ స్టార్టింగ్ లో బాలీవుడ్ నుంచి తనకు ఎలాంటి విమర్శలు రాలేదని, కానీ మీడియా మాత్రం తనను తీవ్రంగా విమర్శించిందని చెప్పుకొచ్చింది. థండర్ థైస్ అనే పదం బాలీవుడ్ లో తననుంచే పుట్టిందని, అప్పట్లో చాలామంది మిడియా వాళ్లు తనను ఆ పేరుతో పిలిచి బాడీ షేమింగ్ చేసేవారని చెప్పుకొచ్చింది.
అంతేకాదు.. అమె జానియన్ బాడీ ఫ్రేమ్ అనే బాడీ షేమింగ్ కామెంట్ కూడా తనకోసమే మీడియా వాళ్లు పుట్టించారని చెప్పుకొచ్చింది. బాధాకరమైన విషయం ఏంటంటే.. రవీనాను బాడీ షేమింగ్ చేసిన మీడియా వాళ్లలో మహిళా జర్నలిస్టులు కూడా ఉన్నారంట.
ఆ తర్వాత కొన్ని రోజులకు తనపై ప్లాస్టిక్ సర్జరీ కామెంట్స్ కూడా వచ్చాయని వెల్లడించింది. తన ముఖంలో కొన్ని భాగాలు బాగాలేవని, మార్చుకోవాలంటూ చాలామంది తనకు సలహాలిచ్చారని చెప్పుకొచ్చింది రవీనా. ఈ క్రమంలో తను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్టు కూడా మీడియా వార్తలు రాసిందని, కానీ తను ఎప్పుడూ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోలేదని రవీనా స్పష్టం చేసింది.
కేజీఎఫ్-2తో మరోసారి లైమ్ లైట్లోకి వచ్చిన ఈమె, ప్రస్తుతం హిందీ సినిమాలతో పాటు, ఓటీటీలో కూడా బిజీగా ఉంటోంది. మరోవైపు తన కూతుర్ని ఇండస్ట్రీకి పరిచయం చేసే ప్రయత్నాల్లో ఉంది.