Advertisement

Advertisement


Home > Politics - Gossip

ఫీల్డ్ మీద అంత సీన్లేదు సార్లూ!

ఫీల్డ్ మీద అంత సీన్లేదు సార్లూ!

ఎన్నికలు దగ్గర పడిపోతున్నాయి. నెమ్మదిగా ఓటర్లలో ఒక రకం టెన్షన్ ప్రారంభం అవుతోంది. నాయకులకు ఒక టెన్షన్, కార్యకర్తలకు ఒక టెన్షన్, అభ్యర్థులది మరొక టెన్షన్ అయితే.. ఓటర్ల టెన్షన్ ఇంకొక తీరుగా ఉంటోంది! ‘ఈ ఎన్నికల్లో తమ ఓటుకు ఏ పార్టీ వారు ఎంత డబ్బు ఇవ్వబోతున్నారు’ అనేది ప్రజల్లో ప్రధానంగా వ్యక్తం అవుతున్న ఆందోళన!

ఎన్నికల ప్రచారం ఎన్ని రకాలుగా సాగుతున్నప్పటికీ, నాయకులు ఆరోపణలు ప్రత్యారోపణలతో ఏ రీతిగా చెలరేగిపోతున్నప్పటికీ.. అంతిమంగా పోలింగ్ రోజు వచ్చే సమయానికి ఓట్లను కొనుగోలు చేయడానికి ఏ అభ్యర్థి ఎంత విలువ కట్టాడు? ఎన్ని వేల రూపాయలు చెల్లిస్తున్నాడు? అనే అంశం దాదాపుగా ప్రతి నియోజకవర్గంలోనూ గణనీయమైన సంఖ్యలో ఓట్లను ప్రభావితం చేస్తుందనేది సత్యం.

ఓట్ల క్రయవిక్రయాలు జరగకుండా నియంత్రించడానికి, ప్రజాస్వామ్యం అపహాస్యం కాకుండా కాపాడడానికి, డబ్బు ఇతర ప్రలోభాలు విచ్చలవిడిగా మారకుండా అడ్డుకోవడానికి ఎన్నికల సంఘం ప్రతిసారి అనేక అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. కానీ చివరిగా పోలింగ్ రోజు వచ్చే సమయానికి ఓటు ధర నిర్ణయం అవుతూ ఉంటుంది. ఈ తంతుమామూలే!

ఈ ఎన్నికలలో ప్రజల టెన్షన్ కూడా అదే. ఈసారి ప్రతి ఓటుకు రేటు బాగానే పలుకుతుందనేది అమ్ముకునే వర్గానికి చెందిన ప్రజల నమ్మకం. అటు తెలుగుదేశం, జనసేన కూటమి పార్టీలు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో చావోరేవో అన్నట్టుగా తలపడుతున్న నేపథ్యంలో ధన ప్రభావం అధికంగా ఉంటుందని ప్రజలు నమ్ముతున్నారు. దానికి తోడు పార్టీల నాయకులు కూడా తమ బహిరంగ సభలోనే ఒక్కొక్క ఓటు ఎంత రేటు పలుకుతుందో ప్రత్యర్థుల మీదికి నెట్టి తమ ప్రసంగాలలోనే చెబుతున్నారు. దాంతో ప్రజలలో ఆశలు కూడా అమాంతం పెరిగిపోతున్నాయి.

ఒకవైపు వైయస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ- చంద్రబాబు వద్ద దోచుకున్న అవినీతి చాలా దండిగా ఉన్నదని వాళ్లు ఒక్కొక్క ఓటుకు నాలుగైదు వేలు ఇవ్వడానికి సిద్ధపడుతున్నారని అంటారు. మరొకవైపు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ ను కొల్లగొడితే ప్రజలందరూ ధనవంతులైపోతారని, వైసిపి నాయకులు నాలుగైదు వేల ధరకు ఓట్లు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆరోపిస్తారు. మధ్యలో తాను కూడా ఉన్నానంటూ అతిశయమైన విమర్శలు చేస్తూ ఉండే వైఎస్ షర్మిల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ఒక్కొక్క ఓటుకు పదివేల రూపాయలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారని నమ్మశక్యం కాని రీతిలో ప్రకటిస్తారు. ఆ పదివేల డబ్బు తీసుకుని.. ప్రజలు ఓట్లు మాత్రం కాంగ్రెస్ కు వేయాలని ఆమె కోరుతున్నారు.

ప్రజలలో అందుకే ఆందోళన వ్యక్తం అవుతోంది! ఇంతకూ ఎంత ఇవ్వబోతున్నారు సార్లూ? 4, 5 వేల ధర గిట్టడం నిజమేనా అని వారు తమకు పరిచయమున్న నాయకులను ప్రైవేటుగా అడుగుతున్నారు. అభ్యర్థులు వారి తరఫున డబ్బు పంపిణీ బాధ్యత చూసే నాయకులు మాత్రం నోరు జారకుండా, కమిట్ కాకుండా- ‘అంత డబ్బు ఎవరిస్తారు.. అవన్నీ ప్రత్యర్థుల కట్టు కథలు’ అని తప్పించుకుంటున్నారు.

వాస్తవానికి క్షేత్రస్థాయిలో విషయాలను పరిశీలిస్తే ఓటుకి రూ.1000 ఇవ్వడానికి ప్రతి ఒక్కరూ సిద్ధంగానే ఉన్నారని.. ఆయా ఊర్లలో స్థానిక పరిస్థితులను బట్టి 1000 అన్న ధరను 500 వంతున పెంచుకుంటూ పోవడానికి సిద్ధపడుతున్నారని తెలుస్తోంది. పరిస్థితి క్లష్టంగా ఉందని అనుకుంటున్న కొందరు నాయకులు ప్రారంభంలోనే 2000 రూపాయలు ఇవ్వడానికి కూడా సిద్ధపడుతున్నారని వినిపిస్తోంది. మొత్తానికి వీళ్ళు ఎంత ధర పెట్టి ఓట్లను కొంటారో ప్రజల ఆందోళన ఎప్పటికీ సర్దుకుంటుందో వేచిచూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?